వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఎంతో చేశాం: పొంగులేటి
అసలు దొరే ఫామ్‌హౌస్‌లో.. పిల్లకాకుల బెదిరింపులకు భయపడం
కూసుమంచి: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు మెరుగైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందించామని, ప్రజల ఆశీస్సులు మళ్లీ తమకే ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వెయ్యి రోజుల పాలనను పురస్కరించుకుని గురువారం ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం నుంచి కూసుమంచి వరకు పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూసుమంచి సెంటర్‌లో మంత్రి కేక్ కట్ చేసి మాట్లాడారు.
అప్పుడు మాటలు.. ఇప్పుడు కోతలు..
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా.. మాటలు తప్ప చేతలు జరగలేదని పొంగులేటి పేర్కొన్నారు. ఆ పార్టీకి అధికారం చేజారగానే వారి పెద్దే ఫామ్‌హౌస్‌కి పరిమితమైతే.. పిల్లకాకులు కోతలు కోస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ నేతలు విషంచిమ్మే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ 3,475 రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేకపోగా, కాంగ్రెస్ వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఉద్యోగాలు.. ఇలా ఎన్నో చేశామని వివరించారు.
ఇదే సమయాన బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని చెప్పారు. కాగా, గత బీఆర్‌ఎస్ పాలనలో పాలేరు రిజర్వాయర్‌ను నిర్లక్ష్యం చేసి, ఇక్కడి రైతులకు కాకుండా మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు నీటిని తరలించారని పేర్కొన్నారు. పాలేరు అంటేనే కాంగ్రెస్ అని, ఎవరెన్ని పొర్లుదండాలు పెట్టినా మళ్లీ ఇక్కడ గెలిచేది, నిలిచేది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


