కొండా సురేఖ బర్తరఫ్‌తో తెరపైకి వచ్చిన మంత్రివర్గ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌తో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. సురేఖ స్థానంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు బెర్తులు కలిపి మొత్తం మూడు స్థానాలపై ఇప్పుడు ఆశావహుల కన్ను పడింది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా..? లేక సమావేశాల తరువాత ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే శనివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తోంది.
కాగా సురేఖను తొలగించిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో చేపట్టిన మార్పులు కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయని గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, ప్రేమ్‌సాగర్‌రావు, రామచంద్రునాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్, మహిళా కోటాలో విజయశాంతి తదితరుల పేర్లు వివిధ దశల్లో ప్రచారంలోకి వచ్చినప్పటికీ... సాకారం కాలేదు. ఇప్పుడు మూడో బెర్తు చేరడంతో పోటీ మరింత పెరగనుంది.
మున్నూరుకాపు, పద్మశాలి లెక్క?
సురేఖ పద్మశాలి కాగా, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు. సురేఖకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రెండు వర్గాలకు న్యాయం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు సురేఖకు ఉద్వాసన పలకడంతో ఆమె స్థానంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన మహిళా నేతలకు పట్టం కట్టారు.
ఆది శ్రీనివాస్ ఆశలపై నీళ్లు?
కాంగ్రెస్ తరపున మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (వేములవాడ) ఒక్కరే. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరుకాపు నుంచి ఆయన పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే కొండా సురేఖ బర్తరఫ్‌కు ముందే మున్నూరుకాపు వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదాలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఆది శ్రీనివాస్‌కు చెక్ పెట్టినట్లయింది. అసమ్మతి గళం వినిపించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు కూడా మరోసారి మంత్రివర్గ విస్తరణలో చర్చలోకి వస్తోంది. తనకు ఇచ్చిన మంత్రి పదవి హామీని నెరవేర్చలేదని ఆయన బాహాటంగానే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి కోసం ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఓవైపు సీఎంపై విమర్శల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోతున్న సురేఖ స్థానంలో రాజగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా చాలాకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రస్తుతం కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా విస్తరణలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాలకు చెందిన ప్రేంసాగర్ రావు, జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో యువ ఎమ్మెల్యేల నుంచి ఒకరికి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా వస్తోంది.


