పూజారి తలుపు తీయగానే పడగవిప్పిన విషనాగు
గంజాం: రోజు మాదిరిగానే వచ్చి గుడి తలుపు తీసిన పూజారికి గుండె ఆగిపోయినంత పనైంది. వెలుతురును చూడగానే లోపలున్న నాగుపాము అంతెత్తున లేచి, పడగవిప్పింది. మరో క్షణమైతే లోపలికి అడుగుపెట్టి ఉండే వాడే! ఆ ఒక్క క్షణమే పూజారి ప్రాణాలను కాపాడింది. ఆయన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులు కూడా చేరుకున్నారు.
అందరూ కలిసి, దాదాపు గంటకుపైగా శ్రమించి, 12 అడుగుల ఆ భారీ విషనాగును పట్టుకున్నారు. ఒడిశాలోని గంజా జిల్లా చికిటి సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక రత్నే మాత ఆలయ పూజారి బుధవారం సాయంత్రం పూజల కోసం ఆలయానికి చేరుకున్నారు. ఆయన ఆలయ తలుపులు తెరిసీ తెరువకుండానే లోపలున్న ఓ భారీ నాగు పాము బుసకొడుతూ అంతెత్తున లేచి పడగ విప్పింది.
పూజారి ఏం చేయాలో తెలియక బిక్కచచ్చి పోయారు. ఆవరణలోకి వచ్చి, చికిటి అటవీ అధికారులకు విషయం తెలిపారు. హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే బృందం కూడా వచ్చింది. ఆ భారీ పాము, చురుగ్గా కదలుతూ ఒక పట్టాన వారికి లొంగలేదు. కాళ్లకు షూలు ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా కాళ్లకు గోనె సంచులు కట్టుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పామును బందీని చేసేందుకు ప్రయత్నాలు సాగించారు.
దాదాపు గంటపాటు శ్రమించిన తర్వాతే వారి ప్రయత్నం ఫలించింది. చివరికి నాగు పాము వశమైంది. అక్కడి నుంచి దానిని తీసుకెళ్లి, సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములు అక్కడ సంచరించడం సాధారణమే అయినా, అంతపెద్ద పాము అదీ అత్యంత ప్రమాదకరం, విషపూరిత నాగుపాము అక్కడ కనిపించడం ఇదే మొదటిసారని స్థానికులు చెప్పారు. పామును పట్టుకెళ్లారని తెలిసి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.


