యజమాని కోసం బ్లాక్‌ ​కోబ్రాతో పెంపుడు కుక్క పోరాటం, కానీ | Loyal pet dog sacrifices life battling cobra to protect owner in Haryana | Sakshi
Sakshi News home page

యజమాని కోసం బ్లాక్‌ ​కోబ్రాతో పెంపుడు కుక్క పోరాటం, కానీ

Jul 1 2026 5:04 PM | Updated on Jul 1 2026 5:15 PM

Loyal pet dog sacrifices life battling cobra to protect owner in Haryana

పెట్‌ డాగ్స్‌​ తమ యజమానిని, అతని కుటుంబాన్ని కాపాడేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకుంటాయి.. ఈ పోరాటంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా హర్యానాలో తన యజమానిని కాపాడటం కోసం ఒక పెంపుడు కుక్క తాచు పాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో పలువుర్ని ఆకట్టుకుంటోంది.

హర్యానాలోని కర్నాల్ జిల్లా నిసింగ్ ప్రాంతంలో తన యజమానిని కాపాడేందుకు 'జిమ్మీ' అనే తొమ్మిదేళ్ల పెంపుడు కుక్క నల్లతాచుపాముతో వీరోచితంగా పోరాడింది. పాము పలుమార్లు కాటు వేసినప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడి, చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన  సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

అసలేం జరిగిందంటే? 

ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో యజమాని సుమిత్ ఠాకూర్ తన రెండు పెంపుడు కుక్కలైన 'జిమ్మీ', 'మాక్స్'లను వాకింగ్‌కు తీసుకెళ్తుండగా ఇంటి ప్రధాన ద్వారం (గేట్) వద్దకు ఒక పెద్ద నల్ల తాచుపాము దూసుకొచ్చింది.  సుమిత్ స్పందించే లోపే రెండు కుక్కలు పాము వైపు దూసుకెళ్లాయి. జిమ్మీ మరో క్షణం ఆలోచించకుండా ముందుకు దూకింది. పడగ విప్పి బుసలుకొడుతున్న తాచుపాముపైకి లంఘించింది. ఈ భీకర పోరాటంలో పాము జిమ్మీ నోటిపై, ఒక కాలుపై తీవ్రంగా కాటు వేసింది. అయినా జిమ్మీ వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే ఉంది. మరో కుక్క 'మాక్స్' ఆ పాము ఇంటి లోపలికి వెళ్లకుండా చుట్టూ తిరుగుతూ అడ్డుకుంది. 8 నిమిషాల్లోనే విషాదం పాము కాటు వేసిన కొద్ది నిమిషాల్లోనే జిమ్మీ శరీరంపై విషప్రభావం చూపడం ప్రారంభమైంది. సుమిత్ చూస్తుండగానే కేవలం 8 నిమిషాల్లో జిమ్మీ పరిస్థితి విషమించింది. సుమిత్ వెంటనే పశువైద్యుడిని పిలిపించినప్పటికీ, వైద్యం అందేలోపే జిమ్మీ కన్నుమూసింది. ఈ లోపల పాము ఒక గోడ వెనుకకు పోయింది. వెంటనే స్నేక్ రెస్క్యూవర్‌ను పిలిపించి ఆ తాచుపామును పట్టుకుని అడవిలో వదిలేశారు. 

కన్నీటి వీడ్కోలు 
కుటుంబంలో ఒకడిగా పెరిగిన తన జిమ్మీ ఇక లేదని లేదని తెలిసి సుమిత్ ఠాకూర్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తనను కాపాడటం కోసం జిమ్మీ తన ప్రాణాలొడ్డిందని భావోద్వేగానికి లోనయ్యారు. తొమ్మిదేళ్లుగా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న జిమ్మీని ఎండాకాలం, చలికాలంలో ఎంతో అపురూపంగా చూసుకున్నామని గుర్తు చేసుకున్నారు. మరోవైపు జిమ్మీ చూపిన విశ్వాసం, ధైర్య సాహసాలను, త్యాగాన్ని స్థానికులతో పాటు నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement