కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య.. పరారైన భార్య! | Newly Married Nashik Man Dies By Suicide | Sakshi
Sakshi News home page

కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య.. పరారైన భార్య!

Jul 1 2026 12:35 PM | Updated on Jul 1 2026 1:08 PM

Newly Married Nashik Man Dies By Suicide

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో 27 ఏళ్ల యువకుడు తన భార్య, అత్తమామల నుండి ఎదురవుతున్న మానసిక వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని అనికేత్ బాలసాహెబ్ జగ్తాప్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంలో మృతుడి భార్య, ఆమె తల్లిదండ్రులు, పినతల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసినప్పటికీ, మృతుడి తండ్రి బాలసాహెబ్ జగ్తాప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్యాంప్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

అనికేత్‌ను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసి, అతను ఈ  నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలపై అతని భార్య శ్రుతి జగ్తాప్, అత్త వందన సుభాష్ ధివ్రే, మామ సుభాష్ సుఖ్‌దేవ్ ధివ్రే, పినతల్లి ఉజ్వల సతీష్ పవార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా పంచశీల్ నగర్‌లో ఉంటున్నారు. ఈ కేసులో శ్రుతి తల్లిదండ్రులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, శ్రుతి, ఆమె పినతల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయకపోతే తాము ఆత్మహుతికి పాల్పడతామని అనికేత్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. పంచశీల్ నగర్‌కు చెందిన శ్రుతి ధివ్రేతో అనికేత్‌కు ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లయినప్పటి నుండి ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని అనికేత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్రుతి, అనికేత్‌తో కలిసి జీవించడానికి నిరాకరించడమే కాకుండా, అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని వారు పేర్కొన్నారు. దీంతో అనికేత్ గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నిరంతర వేధింపులను తట్టుకోలేక, అనికేత్ తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement