‘ఉరి చాలా బాధాకరమే కానీ’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు | SC Upholds Hanging As Death Penalty Method, Says Alternatives May Be Considered In Future, Check More Details | Sakshi
Sakshi News home page

‘ఉరి చాలా బాధాకరమే కానీ’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Aug 18 2026 11:54 AM | Updated on Aug 18 2026 12:28 PM

Hanging Is Painful But SC Keeps Death Penalty Method Unchanged

న్యూఢిల్లీ: మరణశిక్ష అమలు చేసే విధానంపై చాలా దేశాలు పునరాలోచన చేస్తున్నాయి. ఇంజెక్షన్లు, ఛాంబర్లు.. ఇలా కొత్త తరహా మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత్‌లో అనాదీగా వస్తున్న ఉరిశిక్షను మార్చాలంటూ పిటిషన్‌ దాఖలు కాగా.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఎంతో బాధాకరమైనదే అయినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెబుతూ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. 

మరణశిక్షలో ఉరిశిక్షను తొలగించాలంటూ  సీనియర్‌ న్యాయవాది రిషి మల్హోత్రా ఓ పిటిషన్‌ వేశారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (CrPC)లోని సెక్షన్‌ 354(5) ప్రకారం మరణశిక్ష పడిన ఖైదీని “మెడకు ఉరి బిగించి మరణించే వరకు వేలాడదీయాలి” అని నిబంధన ఉంది. ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి.. ఉరి విధానాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.  దీనిని పరిశీలించిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రస్తుతానికి ఆ విధానమే కొనసాగుతుందని చెబుతూ.. పిటిషన్‌ను కొట్టేసింది. అయితే భవిష్యత్తులో బలమైన వైద్య, శాస్త్రీయ ఆధారాలు అందుబాటులోకి వస్తే ఈ అంశాన్ని మరోసారి రాజ్యాంగపరంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

‘ఉరి చాలా బాధాకరం’..
రిషి మల్హోత్రా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. ఉరి తీసే ప్రక్రియలో ఖైదీ తీవ్రంగా, ఎక్కువసేపు బాధపడే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఉరికి బదులుగా లెథల్‌ ఇంజెక్షన్‌, కాల్చి చంపడం, విద్యుదాఘాతం లేదంటే గ్యాస్‌ ఛాంబర్‌ వంటి ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలించాలని కోరారు. ఉరిశిక్ష అమలులో ఖైదీ వెంటనే చనిపోడని.. మరణాన్ని నిర్ధారించేందుకు కొంత సమయం పడుతుందని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనికి భిన్నంగా కొన్ని ప్రత్యామ్నాయ విధానాల్లో మరణం తక్కువ సమయంలోనే సంభవించే అవకాశం ఉందని వాదించారు.

కేంద్రానికి ఆ స్వేచ్ఛ ఉంది
అయితే ప్రస్తుతానికి ఉరి విధానాన్ని రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఈ తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ఉరిశిక్ష అమలు ద్వారా కలిగే బాధ, ఖైదీ గౌరవం, రాజ్యాంగ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన ప్రత్యామ్నాయం ఉందా? అనే అంశాన్ని నిపుణుల కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్రం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. 

2023లోనే మొదలైన చర్చ
ఉరిశిక్ష అమలు విధానంపై ఈ చర్చ ఇప్పటిది కాదు. 2023 మార్చిలో ఇదే పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. ఉరి వల్ల కలిగే నొప్పి, మరణానికి పట్టే సమయం, అమలులో ఎదురయ్యే సమస్యలపై వివరాలు సేకరించాలని అటార్నీ జనరల్‌ను కోరింది. అదే ఏడాది మేలో కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి.. మరణశిక్ష అమలుకు మెరుగైన ప్రత్యామ్నాయ విధానం ఉందా? అనే అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కోర్టుకు తెలిపారు.

‘లెథల్‌ ఇంజెక్షన్‌’పై భిన్నాభిప్రాయాలు
విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు అమెరికా సహా ఇతర దేశాల్లో అమల్లో ఉన్న లెథల్‌ ఇంజెక్షన్‌ విధానాన్ని ప్రస్తావించారు. ఖైదీకి ఉరి లేదా లెథల్‌ ఇంజెక్షన్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కూడా వాదించారు. అయితే లెథల్‌ ఇంజెక్షన్‌ పూర్తిగా నొప్పిలేని, మానవీయ విధానమేనన్న అభిప్రాయాన్ని ప్రాజెక్ట్‌ 39A సైతం పూర్తిగా సమర్థించలేదు. ఇతర దేశాల్లో ఈ విధానం అమలైన అనుభవాలను పరిశీలిస్తే.. అది కూడా అనేక సమస్యలకు దారితీసిన సందర్భాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రత్యామ్నాయాలపై మరింత శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచించింది.

ఉరి వేసేవారి మానసిక పరిస్థితిపైనా..
విచారణలో మరో ఆసక్తికర అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మరణశిక్ష అమలు చేసే జైలు సిబ్బంది, ఉరివేసే వ్యక్తుల(తలారీ)పై పడే మానసిక ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్‌ సందీప్‌ మెహతా సూచించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుత ఉరి విధానాన్ని రద్దు చేయకపోయినా, మరణశిక్షను ఏ విధంగా అమలు చేయాలి? ఖైదీకి కనీస బాధతో, గౌరవాన్ని కాపాడుతూ శిక్షను అమలు చేయగలమా? అనే అంశంపై భవిష్యత్‌ చర్చకు మార్గం తెరిచి ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement