తమిళనాడులో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం మరింత విస్తరించింది. శుక్రవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ పథకం విస్తరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల బస్సులో కాసేపు కండక్టర్ అవతారం ఎత్తి స్వయంగా టికెట్లు అందించి ప్రయాణికులతో మాట్లాడారు. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు ఆయన్ని సర్‌ప్రైజ్ చేశారు.
తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విస్తరణతో.. రోజుకు సుమారు 84 లక్షల మంది ప్రయోజనం పొందుతారని టీవీకే ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు పరిమితంగా ఉన్న సేవలను మరింత విస్తరించి, ఎక్కువ మంది మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి మహిళలు డీలక్స్, ఎక్స్‌ప్రెస్ కేటగిరీ సేవలను కూడా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లబ్ధిదారులకు ఎలాంటి ఆదాయ పరిమితి ఉండదని, ప్రయాణాల సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితి లేదని పేర్కొంది. రోజువారీ ఉద్యోగాలు, విద్య, వ్యాపార అవసరాలు, ఇతర పనుల కోసం ప్రయాణించే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
విజయ్ జేబులో చాక్లెట్లు
పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం విజయ్ మహిళల బస్సులోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. స్వయంగా టికెట్లు అందించారు. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థులు ఉత్సాహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు కొందరు ఆయనకు చాక్లెట్లు ఇవ్వగా.. ఆయన వాటిని జేబులో దాచుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
CM Vijay is personally handing out tickets to women on the women's bus.
College students are sharing 'Dairy Milk' chocolates, adding to the excitement! 😅❤️ pic.twitter.com/NOy11JqpzK— Actor Vijay Team (@ActorVijayTeam) October 2, 2026
మహిళల ఆర్థిక భారం తగ్గించడం, ప్రజా రవాణాను మరింత వినియోగంలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం విజయ్ ఈ సందర్భంగా చెప్పారు. పథకం విస్తరణతో మరిన్ని ప్రాంతాల్లో మహిళలకు ప్రయోజనం అందనుందని అన్నారాయన.
ఇదీ చదవండి: గాంధీ గురించి జెన్‌జీ అభిప్రాయమిదేనా?


