సత్యభామకు ఓదార్పు.. ‘స్వీట్‌ బ్రో’ సభలో కన్నీటి డ్రామానా? | Kanimozhi Calls Vijays Sweet Bro Moment a Sympathy Drama | Sakshi
Sakshi News home page

సత్యభామకు ఓదార్పు.. ‘స్వీట్‌ బ్రో’ సభలో కన్నీటి డ్రామానా?

Oct 2 2026 9:16 AM | Updated on Oct 2 2026 9:16 AM

Kanimozhi Calls Vijays Sweet Bro Moment a Sympathy Drama

ఉప ఎన్నికల వేళ.. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌ ప్రచార సభలో చోటుచేసుకున్న ఓ భావోద్వేగ ఘటనపై డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. ధారాపురం ఉప ఎన్నిక ప్రచారంలో టీవీకే అభ్యర్థి సత్యభామ ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకోగా.. విజయ్‌ ఆమెను ఓదార్చారు. ఈ ఘటనపై డీఎంకే నేత కనిమొళి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ప్రజల సానుభూతి కోసం ఆడిన నాటకమంటూ విమర్శించారు.

ధారాపురంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో టీవీకే అభ్యర్థి సత్యభామ(Sathiyabama) మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే వేదికపై ఉన్న విజయ్‌ ఆమెను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ ఘటనపై స్పందించిన డీఎంకే నేత కనిమొళి.. మొత్తం పరిణామం ముందే ప్లాన్‌ చేసినట్లుగా ఉందని ఆరోపించారు.

‘స్వీట్‌ బ్రో’ అంటూ వచ్చి..
“మంత్రి రాజ్‌కుమార్‌కు ఫోన్‌ వస్తుంది. ఆయన మాట్లాడిన తర్వాత సత్యభామ చెవిలో ఏదో చెబుతారు. వెంటనే బాగా మాట్లాడుతున్న ఆమె కన్నీళ్లు పెట్టుకుంటారు. మహిళగా తాను ఒత్తిడిలో ఉన్నానని చెబుతారు. ఆ తర్వాత విజయ్‌ వచ్చి ఓదారుస్తారు. వెంటనే ప్రజల నుంచి స్పందన వస్తుంది. వేదికపైనైనా, ప్రచారంలోనైనా విజయ్‌ ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు” అంటూ కనిమొళి ఆరోపించారు.

టీవీకే నుంచి ఘాటు కౌంటర్‌
కనిమొళి వ్యాఖ్యలపై టీవీకే నేత, తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్‌ తీవ్రంగా స్పందించారు. ఇవి దురుద్దేశపూరిత ఆరోపణలని ఖండించారు. సత్యభామ ప్రసంగాన్ని త్వరగా ముగించాలని మాత్రమే రాజ్‌కుమార్‌ సూచించారని, దానిని వక్రీకరించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “ఇలాంటి ఆరోపణలు విని ఆశ్చర్యపోయాను. ఇది పూర్తిగా అసత్యం. సభల్లో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసంగాలను కుదించాలని చెప్పడం సాధారణమే” అని రాజ్‌మోహన్‌ తెలిపారు.

ఎండలో గంటల తరబడి ప్రజలు.. 
విజయ్‌ ఎనిమిది గంటలకు పైగా ప్రయాణించి ఎండలో తడిసిపోయేంతగా ప్రచారం నిర్వహించారని, ప్రజలు కూడా గంటల తరబడి వేచి ఉన్నారని రాజ్‌మోహన్‌ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసంగ సమయాన్ని తగ్గించాలని సూచించడం సాధారణ ప్రక్రియేనని పేర్కొన్నారు.
గతంలోనూ పెద్ద సభల నిర్వహణలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి ప్రముఖులకు కూడా సమయ పరిమితి గురించి సూచనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ రియాక్షన్‌
ఈ వివాదంపై తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్‌ కూడా స్పందించారు. ఇతర పార్టీల ప్రచారాలను డ్రామా అంటూ విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలను కలిసేందుకు ఒక పార్టీ చేసే కార్యక్రమం ప్రచారమైతే, మరో పార్టీ చేస్తే డ్రామా ఎలా అవుతుందని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: అతన్ని ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement