breaking news
death sentences
-
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఉగ్రవాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వేసిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించడం తెలిసిందే. అయితే ఓ కేసులో నిందితులందరికీ ఉరి శిక్ష పడటం, కింది కోర్టు తీర్పును హైకోర్టు యథాతథంగా సమర్థించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా.. ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. మిగతా ఐదుగురికి ఉరి శిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. దేశంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, కింది కోర్టులో శిక్షపడి, దాన్ని హైకోర్టు ఖరారు చేసిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.ఎవరీ ఐదుగురు? ఇప్పుడెక్కడ ఉన్నారు?పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరి ్డగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకి స్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాల్గొన్నారు. పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ దేశంలోని వేర్వే రు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుంది. వివిధ కేసులకు సంబంధించి కొంతకాలం ముంబై, పుణే జైళ్లలో ఉన్న ఈ ఐదుగురూ ప్రస్తుతం తిహార్ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు.ఎప్పుడు.. ఎక్కడ చిక్కారంటే..ఎజాజ్ షేక్‌ను 2013 సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నట్లు ఎన్ఐఏ రికార్డుల్లో పేర్కొంది. యాసీన్, హడ్డీలు 2013 ఆగస్టు 29న బిహార్‌లోని రక్సుల్ ప్రాంతంలో దొరికారని తెలిపింది. జియా ఉర్ రెహ్మాన్‌ను రాజస్తాన్‌లోని అజ్మీర్ రైల్వేస్టేషన్లో 2014 మార్చ్ 22న, తెహసీన్ అక్తర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నట్లు పేర్కొంది. యాసీన్ అరెస్టు తర్వాత ఎజాజ్ షేక్‌కు దిల్సుఖ్నగర్ పేలుళ్ళలో పాత్ర ఉన్నట్లు తేలింది. కాగా వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్ఐఏ హైదరాబాద్‌కు తీసుకువచ్చి అరెస్టు చేసింది. రెండు కేసులు .. ఒకే ఉదంతం2013 ఫిబ్రవరి 21న తొలుత దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్ వద్ద , తర్వాత ఏ–1 మిర్చి సెంటర్ వద్ద కొన్ని సెకన్ల తేడాతో జరిగిన పేలుళ్లలో ఓ గర్భస్థ శిశువు సహా 18 మంది మరణించగా.. 131 మంది క్షతగాత్రులయ్యారు. మొదటిది సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 38 సెకండ్లకు పేలగా, రెండోది 6 గంటల 58 నిమిషాల 44 సెకండ్లకు పేలింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో నమోదైన ఈ కేసులు దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు బదిలీ అయ్యాయి.దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు సంబంధించి సాంకేతికంగా రెండు కేసులు నమోదైనప్పటికీ ఒకే ఘటన కింద పరిగణనలోకి తీసుకున్నారు. నగరంలో 1990ల నుంచీ ఉగ్రవాద ఛాయలు ఉండటంతో అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏ కేసులోనూ ఎవరికీ ఉరి శిక్ష పడిన దాఖలాలు లేవు. అలాగే ఒకే ఉదంతానికి సంబంధించి మొత్తం దోషులందరికీ ఉరి శిక్షలు వేసిన కేసులు కూడా లేవు.ఏ ప్రాంతానికి చెందినవాళ్లు?⇒ రియాజ్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న తెంగినగుడి ⇒ అసదుల్లా అక్తర్: ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో ఉన్న గులమ్కాపూర్⇒ జకీ ఉర్ రెహ్మాన్: పాకిస్తాన్ పంజాబ్‌లో ఉన్న గోజారా⇒ తెహసీన్ అక్తర్: బిహార్‌లోని సమిస్తిపూర్ జిల్లా ముట్కాపూర్ ⇒ యాసీన్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న ముగ్దుం కాలనీ.⇒ ఎజాజ్ షేక్: మహారాష్ట్రలోని పుణే ఘోర్పేట్ఎవరి పాత్రలు ఏంటి?రియాజ్ భత్కల్: కీలక సూత్రధారియాసీన్ భత్కల్: నేపాల్‌లో ఉండి కుట్రను అమలు చేశాడువకాస్: 107 బస్‌స్టాప్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ పెట్టాడుమోను: ఏ–1 మిర్చి సెంటర్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ వదిలాడుహడ్డీ: అబ్దుల్లాపూర్ మెట్లో షెల్టర్ తీసుకున్నాడు. సైకిళ్ళు తదితరాలు కొనుగోలు చేశాడు.ఎజాజ్: అవసరమైన పేలుడు పదార్థాలు, నగదు సమకూర్చాడువిచారణ పూర్తి, శిక్షలు..2016 నవంబర్ 21న కేసుల విచారణ పూర్తి కాగా.. డిసెంబర్ 13న పరారీలో ఉన్న రియాజ్ మినహా మిగిలిన ఐదుగురినీ ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. అదే నెల 19న వారికి ఉరి శిక్ష విధించింది. -
సౌదీ ధోరణి సరికాదు
సౌదీ అరేబియా ప్రమాదకర పోకడలకు పోతోంది. తన సంక్షోభాన్ని పశ్చిమాసియాపై రుద్ది, తన సమస్యను ప్రపంచ సమస్యగా మార్చాలని విశ్వప్రయత్నం చేస్తోంది. నూతన సంవత్సరం ప్రారంభమైన మర్నాడే దేశంలో షియా మతగురువు అల్-నిమ్త్రోసహా 47మందిపై అది అమలు చేసిన మరణశిక్షలు అనేక దేశాల్లో నిరసనలకూ, ఉద్రిక్తతలకూ దారితీశాయి. ఇరాన్ రాజధాని టెహరాన్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతోపాటు మరో నగరంలోని సౌదీ కాన్సులర్ భవనంపై బాంబులు విసిరారు. ఈ నిరసనలను సాకుగా తీసుకుని ఇరాన్‌తో సౌదీ అరేబియా తన దౌత్యసంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించడమే కాక, తమ దేశంలోని ఇరాన్ దౌత్య సిబ్బంది 48 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది. ఆ దేశంతో వైమానిక సర్వీసులనూ, వాణిజ్యాన్ని కూడా రద్దు చేసుకుంది. బహ్రెయిన్, సూడాన్లు సైతం సౌదీ మార్గాన్నే అనుసరించగా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్‌తో తనకున్న దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. కువైట్ కూడా ఇరాన్‌లోని తన రాయబారిని వెనక్కి పిలిపించింది. గత కొన్నేళ్లుగా ప్రపంచంలో 140కిపైగా దేశాలు ఉరిశిక్షల్ని రద్దు చేయడమో, వాటిని అమలు చేయకపోవడమో కొనసాగిస్తున్నాయి. పశ్చిమాసియాలోని రెండు ముఖ్య దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్ మాత్రమే అధిక సంఖ్యలో మరణశిక్షల్ని అమలుచేస్తున్నాయి. 2014లో సౌదీ 90మందిని ఉరితీయగా నిరుడు ఆ సంఖ్య 157కు చేరుకుంది. అటు ఇరాన్‌కూడా తక్కువేమీ తినలేదు. అది 694మందిని ఉరికంబానికి ఎక్కించింది. ఇప్పుడు సౌదీ మరణదండన అమలు చేసినవారిలో షియా మత గురువు ఉండటం పలు దేశాల్లో ఉన్న ఆ తెగవారిలో ఆగ్రహాన్ని కలిగించింది. సహజంగానే ఇరాన్లో షియాలు ఎక్కువగా ఉంటారు గనుక ఆ ఆగ్రహం అవధులు దాటింది. ఇందుకు ఇరాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది కూడా. అయినా సౌదీ శాంతించలేదు. మరణశిక్షలు అమలు చేసినరోజే యెమెన్‌లో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఆ దేశంలో సౌదీ అరేబియా వైమానిక దాడులకు పాల్పడటం యాదృచ్ఛికమేమీ కాదు. యెమెన్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతీ మిలి టెంట్లు షియా తెగవారే. షియా మత గురువును ఉరితీయడంద్వారా, యెమెన్‌లో దాడుల్ని పునఃప్రారంభించడం ద్వారా ఇరాన్‌లోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న షియాలను రెచ్చగొట్టడం...ఆ సాకుతో ఇరాన్‌తో ఉన్న సంబంధాలను తెంచు కోవడం సౌదీ ధ్యేయం. నిజానికి షియా మత గురువును ఉరితీయడం అన్యాయం, అమానవీయం. 2011లో అరబ్ దేశాల్లో ‘జాస్మిన్ విప్లవం’ ఉవ్వెత్తున ఎగసిన ప్పుడు తమ తెగ ఎదుర్కొంటున్న అణచివేతకు నిరసనగా జరిగిన శాంతియుత ఉద్యమానికి ఆయన నేతృత్వంవహించాడు. సౌదీలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్న తమ తెగకు కనీస హక్కులు లేకపోవడాన్ని నిలదీశాడు. సౌదీ రాజరికానికి అది మరణశిక్ష విధించాల్సిన తీవ్రమైన నేరమైంది! ఆయనతోపాటు ఇప్పుడు మరణశిక్ష అమలైనవారిలో సున్నీలు కూడా ఉన్నారుగానీ వారంతా అల్-కాయిదా నాయకుడు బిన్ లాడెన్ పిలుపు మేరకు 2003- 2006 మధ్య సౌదీలో వివిధ ఉగ్రవాద సంఘటనల్లో పాల్గొన్నవారు. సౌదీ అరేబియా ఇటీవలికాలంలో అనుసరిస్తున్న ధోరణుల వెనక వేరే కారణాలున్నాయి. షియా తెగకు చెందిన సిరియా అధినేత బషర్ అల్ అసద్‌ను పదవీభ్రష్టుణ్ణి చేయడానికి అమెరికాను ముందుపెట్టి ప్రారంభించిన యుద్ధం ఇప్పటికి అయిదేళ్లు దాటుతున్నా దారీతెన్నూ లేకుండా పోయింది. ఆ యుద్ధంవల్ల పుట్టుకొచ్చిన ఐఎస్ ఉగ్రవాద సంస్థను నియంత్రించడమెలాగో తెలియక అయోమ యంలో పడిన అమెరికా...చివరకు అసద్‌తోనే చెలిమికి సంసిద్ధం కావడం, ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సౌదీకి రుచించలేదు. దానికితోడు అసద్‌కు బాసటగా రష్యా రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మొత్తం మారి పోయింది. యెమెన్‌లో తాను ఈజిప్టు, బహ్రెయిన్, కువైట్, సూడాన్ తదితర దేశాలను తోడు తెచ్చుకుని, అమెరికా మద్దతుతో మొదలెట్టిన యుద్ధం సైతం అనుకున్న ఫలితాన్ని సాధించకుండానే కాల్పుల విరమణకు దారితీయడం సౌదీ అరేబియాకు పుండుమీద కారం జల్లినట్టయింది. అమెరికా-ఇరాన్ సంధి సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. అమెరికా ఆంక్షల పర్యవసానంగా పలు సంవత్సరాలనుంచి ప్రపంచ మార్కెట్లో ఇరాన్ చమురు లేకుండా పోయింది. కనుక ఆ రంగంలో తనదే ఆధిపత్యం. ఇప్పుడది పూర్తిగా తారుమారయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరుడు సౌదీ బడ్జెట్ 9,800 కోట్ల డాలర్ల లోటుతో సాగింది. అది ఈ ఏడాది మరింత పెరగవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలు ఒక్క ఏడాదిలోనే దాదాపు 90 కోట్ల డాలర్ల మేర పడిపోయాయి. పర్యవసానంగా దేశంలో గ్యాస్ ధరలను 50 శాతం పెంచడంతోపాటు సబ్సిడీలపై కోతలు విధిం చింది. ఈ పరిణామాలన్నీ దేశ ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఇరాన్‌ను మళ్లీ ఏకాకిని చేస్తే తప్ప, అమెరికా-ఇరాన్‌లమధ్య కుదిరిన అవగాహనను దెబ్బ తీస్తే తప్ప దీనంతటినుంచీ బయటపడటం సాధ్యం కాదని భావించబట్టే సౌదీ అరేబియా విపరీత పోకడలకు పోతోంది. ఐఎస్ ఉగ్రవాదంపై అన్ని దేశాలూ సమష్టిగా పోరాడవలసిన తరుణంలో సౌదీ అరేబియా ఆ వాతావరణాన్ని ఛిద్రం చేస్తున్నది. ఇలాంటి ధోరణులు అరబ్ దేశాల్లో సామరస్యంగా, ప్రశాంతంగా జీవిస్తున్న షియా, సున్నీ తెగలమధ్య వైరాన్ని పెంచుతాయి. పశ్చిమాసియాను రణక్షేత్రంగా మారుస్తాయి. ఈ పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీస్తాయి. ఇన్నాళ్లుగా సౌదీ ఏం చేసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అమెరికా ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. సౌదీని కట్టడి చేయాలి.