ఈ చావుకు బాధ్యులెవరు? | Puttur Flexi Accident Students Death Chittoor Safety Concerns Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఈ చావుకు బాధ్యులెవరు?

Aug 17 2026 1:52 PM | Updated on Aug 17 2026 1:58 PM

Puttur Flexi Accident Students Death Chittoor Safety Concerns Andhra Pradesh

ఫ్లెక్సీ కడుతూ మృతి చెందిన గోకుల్‌ కోసం మిస్‌ యూ అంటూ వెలసిన ఫ్లెక్సీ

అభిమాన ముసుగు.. మృత్యువుతో చెలగాటం!

జిల్లాలో పెరిగిపోయిన ఫ్లెక్సీల సంస్కృతి

బ్యానర్లు కడుతూ పలువురు మృత్యువాత

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబాలు

ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు: పండుగైనా, పుట్టిన రోజైనా, రాజకీయ నేతల పర్యటనలైనా ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. అభిమానం ముసుగులో మృత్యువుతో చెలగాటం ఆడుతున్నామన్న ఆలోచనను యువకులు విస్మరిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే క్రమంలో కనీస భద్రతా ప్రమాణాలను పాట్టించడం లేదు. దీంతో ఎంతో భవిష్యత్‌ ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.

పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్‌ తీగలు తగిలి గోకుల్, విఘ్నేష్‌ అనే ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకొన్న తాజా దుర్ఘటనే ఇందుకు నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహించాలి?.. ఆర్భాటాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలా?.. నిబంధనలు అమలు చేయని అధికారులా?.. అభిమానం పేరిట హద్దులు దాటుతున్న యువకులా?.. పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులా? ఎవరు.. ఎవరు అన్న ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

పుత్తూరు పట్టణంలో గత శుక్రవారం చోటు చేసుకొన్న గోకుల్, విఘ్నేష్‌ అనే విద్యార్థుల అకాల మరణంపై పెద్ద చర్చే జరుగుతోంది. అది ఒక ప్రమాదం కాదని, ఈ దుర్ఘటనను ఇద్దరు విద్యార్థులు విద్యుత్‌ తీగలు తగిలి మృతి అంటూ ఒక వార్తగా చదవరాదని పలువురు వాదనలు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ, సామాజిక ఒత్తిళ్లు ఒకవైపు, అధికారుల నిర్లక్ష్యం మరోవైపు ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో యువకుల తొందరపాటు, తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం కూడా ఉందంటూ వివరిస్తున్నారు.

ఫ్లెక్సీలు కట్టడం చిన్న పని కాదు 
పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్లు, జాతరలు, రాజకీయ నాయకుల పర్యటనలు అంటూ ప్రతి కార్యక్రమానికీ రోడ్డు పక్కన ఫ్లెక్సీల ఏర్పాటు సాధారణ విషయంగా మారిపోయింది. అయితే వీటిని ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ ఫోల్స్, రహదారి పక్కన ఉండే గోతులు, వాహనాల ఎత్తు వంటి పలు విధాలుగా మృత్యువు పొంచి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించి యువకులు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు నడుం బిగించాల్సి ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది.

రాజకీయ నేతలు చేయాల్సింది ఏమిటీ?
నాయకులు, ప్రజాప్రతినిదులు సైతం తమ అభిమానులు ప్రమాదకర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. పరిమిత పరిమాణం, పరిమిత సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలన్న సూచనలు చేయాలి. తమ స్వాగతం కోసం మరొకరి ప్రాణం పోకూడదన్న బాధ్యతగా రాజకీయ నేతలు వ్యవహరించాలి.

అధికారుల బాధ్యత ఏదీ? 
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫ్లెక్సీల నియంత్రణలో అధికారుల పనితీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్, పోలీస్, విద్యుత్‌ శాఖ అధికారుల బాద్యత ఎంతో కీలకం. అయితే వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రమాదాలకు పరోక్షంగా అవకాశం కల్పిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అధికారులు పరిశీలించాల్సిన అంశాలు

  • ఫ్లెక్సీ ఎక్కడ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు?

  • విద్యుత్‌ పోల్స్, తీగలు ఎంత దూరంలో ఉన్నాయి?

  • రహదారిలో వాహనాలకు అడ్డు తగిలే అవకాశం ఉందా?

  • ఫ్లెక్సీ పరిణామం, నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా?

  • గాలి, వానకు ఫ్లెక్సీ కూలితే పాదచారులకు, ప్రయాణికులకు ప్రయాదం జరిగే అవకాశం ఉందా?

  • ఫ్లెక్సీ ఏర్పాటు సమయం, కాల పరిమితి ఎంత? 
    ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఫ్లెక్సీ ఏర్పాటుకు తగిన రుసుం వసూలు చేసి అనుమతివ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement