ఏఈ నాగరాజు దంపతులు (ఫైల్)
గోదావరిలో దూకిన ఏఈ, భార్య, కుమార్తె, మనుమడు
మనుమడిని రక్షించిన జాలర్లు ∙ఏఈ మృతదేహం లభ్యం.. భార్య, కుమార్తె గల్లంతు
షేక్ సాధిక్ ఖాన్ అనే వ్యక్తి వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో ఏఈ వెల్లడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చక్కగా సాగిపోయే కుటుంబంలో అల్లుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత ఓ వ్యక్తి ఆ కుటుంబం వ్యవహారాల్లోకి ప్రవేశించడంతో కల్లోలమే రేగింది. ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో పంచాయతీరాజ్ శాఖలో ఏఈ, ఆయన భార్య, కుమార్తె, మనుమడు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం రైల్ కం రోడ్డు బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకేశారు. ఏఈ తెల్లపూడి నాగరాజు (60) మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (32) గల్లంతవగా, ఆయన మనుమడు కార్తికేయ రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. చనిపోయే ముందు ఆ ఏఈ రాసిన మరణ వాంగ్మూలం (లేఖ) పోలీసులకు లభ్యమైంది.
షేక్ సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేకే..
ఏఈ రాసిన లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన తెల్లపూడి నాగరాజు (60) పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె సౌజన్యకు జగదీశ్వరరావుతో వివాహమైంది. దీంతో వీరి కుటుంబం కాకినాడలో ఉంటున్నారు. సౌజన్య తన కుమారుడు కార్తికేయ రెడ్డిని కాకినాడలో రైఫిల్ షూటింగ్ అకాడెమీ నడుపుతున్న షేక్ సాధిక్ ఖాన్ వద్ద రైఫిల్ షూటింగ్ శిక్షణలో చేర్పించింది. కాకినాడలోని ఒక ప్రైవేట్ స్కూలులో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఈత కూడా నేర్చుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జగదీశ్వరరావు అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. అప్పటి నుంచి సౌజన్యకు అండగా ఉంటానని షేక్ సాధిక్ ఖాన్ చెప్పుకొస్తున్నాడు. దీనికి ఏఈ నాగరాజు ఒప్పుకోలేదు. దీంతో సౌజన్యను సాధిక్ ఖాన్ వేధించడం ప్రారంభించాడు. నాగరాజును, కార్తికేయ రెడ్డిని చంపుతానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. తర్వాత ఆమె వద్ద నుంచి బ్యాంకు అకౌంట్‌లు, ఏటీఎం కార్డులు బలవంతంగా తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. పదిహేనేళ్లుగా చాలా పరువుగా బతుకుతున్న తమను, తన కుమార్తె సౌజన్యను షేక్ సాధిక్ ఖాన్ మోసం చేశాడని, దీనిపై అడిగితే తమను చంపుతానని బెదిరిస్తున్నాడని లేఖలో నాగరాజు పేర్కొన్నారు.
కాకినాడ నుంచి కారులో వచ్చి..
షేక్ సా«ధిక్ ఖాన్ వేధింపులు భరించలేక గోదావరి నదిలో దూకి చనిపోవాలని ఏఈ నాగరాజు కుటుంబం నిశ్చయించుకుంది. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కాకినాడ నుంచి రాజమహేంద్రవరానికి సొంత కారులో బయల్దేరారు. రాత్రి 12 గంటల సమయానికి కొవ్వూరుకు చేరుకున్నారు. అక్కడ డ్రైవర్‌ని వెనక్కి పంపించేశారు. అనంతరం సౌజన్య కారు డ్రైవ్ చేయగా, రోడ్డు కం రైలు బ్రిడ్జి పైకి చేరుకున్నారు. బ్రిడ్జిపైన కారును ఆపారు. బ్రిడ్జి పైనుంచి నాగరాజు, ఆయన భార్య, కుమార్తె, మనుమడు గోదావరిలోకి దూకేశారు.
బాలుడిని రక్షించిన జాలర్లు
గోదావరిలో చేపల వేటలో ఉన్న జాలర్లకు వీరు దూకిన శబ్దం వినిపించింది. వెంటనే వారు దూకిన వైపు వెళ్లారు. బాలుడు కార్తికేయ రెడ్డి నీటిలో ఈదుతూ కనిపించాడు. వెంటనే అతన్ని జాలర్లు నదిలో నుంచి బయటకు లాగి ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మిగతా ముగ్గురూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. జాలర్ల సమాచారంతో రెండో పట్టణ పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు, జాలర్లు నదిలో గాలించారు. సోమవారం సాయంత్రానికి రాజమహేంద్రవరం దోభీ ఘాట్ వద్ద నాగరాజు మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎ.శివప్రియ నేతృత్వంలో సీఐ శివగణేష్ బృందం కాకినాడ వెళ్లి ఘటనకు కారకుడుగా ఏఈ పేర్కొన్న షేక్ సాధిక్ ఖాన్ కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ ఆచూకీ కోసం కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.


