రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు చంద్రబాబూ?
సీఎంని నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదే సాక్ష్యం
వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటున్నారు
అందువల్లే అవి ఇంతగా భ్రష్టుపట్టాయి... పైకి నీతి కబుర్లు చెబుతూ వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలిలాగే ఉంటాయి
రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వేధించడంపై ఎంతో శ్రద్ధ చూపిస్తారుగా..
అందులో కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి
శంఖవరప్పాడు ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి
తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనంలో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకటంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తేం రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? అంటూ ఎత్తిచూపారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే.. వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అంటూ ప్రశ్నించారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోందంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.
రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వేధించడంపై చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టాలంటూ చురకలంటించారు. ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి.. డైవర్ట్ చేయకండి.. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తూ ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే...
ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
‘‘హే రామ్! గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? చంద్రబాబు గారూ.. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం.
రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది.
నిజాన్ని బయటపెట్టడమే నేరమా?
ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, ‘‘వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం’’ అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?
నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా?
ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు గారూం.. రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి. ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్‌బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి’’.


