కాకినాడ భూ కుంభకోణం వ్యవహారంలో ఎస్‌జీపీ ప్రణతి తీరుపై హైకోర్టు అసహనం
ఈ అక్రమాలపై ప్రణతి, ఆమె భర్తను గతంలో తీవ్రంగా తప్పుపట్టిన జస్టిస్ హరినాథ్
సింగిల్ జడ్జి వ్యాఖ్యలను తొలగించాలంటూ ప్రణతి అప్పీల్
ఈ అప్పీల్‌ను తాజాగా విచారించిన హైకోర్టు
సింగిల్ జడ్జి వద్ద ఉన్న ఈ వ్యాజ్యం గురించి ఈ సందర్భంగా ప్రశ్నించిన ధర్మాసనం
తెలియదని చెప్పిన ప్రణతి తరఫు న్యాయవాది
దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజే బెంచ్
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహా రంలో సోమవారం హైకోర్టులో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. తనతో పాటు తన భర్త, ఇతరులపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌పై సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
ఈ సందర్భంగా సింగిల్ జడ్జి హరినాథ్ వద్ద ఉన్న వ్యాజ్యం గురించి ప్రశ్నించింది. ప్రణతి తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు తెలియదని, అందులో తాము పార్టీ కాదని చెప్పారు. ‘తెలియదు అని చెప్పేస్తే సరిపోదు. తమ ముందున్న ప్రణతి అప్పీల్‌తో ముడిపడి ఉన్న వ్యాజ్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని ధర్మాసనం ఈ సందర్భంగా గట్టిగా చెప్పింది. దీంతో ఆ వ్యాజ్యం విచారణ గురించి తెలుసుకుంటామని ఆదినారాయణరావు చెప్పారు.
అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ఆగస్టు 3న సింగిల్ జడ్జి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులు (మీపై నమ్మకంలేదంటూ ప్రణతి భర్త రాహుల్ చౌదరి దాఖలు చేసిన మెమోపై ఇచ్చిన ఉత్తర్వులు) గురించి తెలుసా? అని ప్రణతి తరఫు ఆన్ రికార్డ్ న్యాయవాది నిరంజన్‌బాబును ప్రశ్నించింది. తమకు తెలీదని చెప్పగానే, ధర్మాసనం ‘గుడ్.. వెరీ గుడ్’ అంటూ అసహనం వ్యక్తం చేసి విచారణను వాయిదా వేసింది.
ప్రణతి అఫిడవిట్‌ను ఆమోదించొద్దు
అంతక్రితం ప్రణతి తరఫున సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు సింగిల్ జడ్జిపై తాము చేసిన ఆరోపణలను తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ సమయంలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ఈ అఫిడవిట్‌ను ఆమోదించకూడదన్నారు. ఇదే రీతిలో తెలంగాణ హైకోర్టు జడ్జిపై పెద్దిరాజు అనే వ్యక్తి పలు ఆరోపణలు చేశారని, తరువాత ఆ ఆరోపణలను ఉపసంహరించుకుంటూ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రణతి దాఖలు చేసిన అఫిడవిట్‌పై అభ్యంతరం ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేస్తానని వెంకట్ చెప్పారు.
జస్టిస్ హరినాథ్‌పై ప్రణతి భర్త ఆరోపణలు
ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్‌పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి పలు ఆరోపణలు చేయగా, ఆమె భర్త, న్యాయవాది రాహుల్ చౌదరి సైతం పిటిషనర్ల తరఫున ఆరోపణలు చేశారు. కాకినాడ భూ వివాదంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మీపై మాకు నమ్మకం లేదని జస్టిస్ హరినాథ్‌పై రాహుల్ చౌదరి ఆరోపణ చేశారు. సీజే ధర్మాసనం ముందు అప్పీల్ (ఎస్‌జీపీ ప్రణతి దాఖలు చేసింది) తేలేంత వరకు తమ వ్యాజ్యంపై విచారణ జరపవద్దని కూడా ఆయన కోరారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాలతో మెమో దాఖలు చేయాలని రాహుల్ చౌదరిని ఆదేశించారు.
దీంతో రాహుల్ ఇటీవల ఓ మెమో దాఖలు చేశారు. దానిని పరిశీలించిన జస్టిస్ హరినాథ్ విచారణ నుంచి తప్పుకోవడానికి, విచారణను వాయిదా వేయడానికి నిరాకరించారు. విచారణను వాయిదా వేయడానికి గానీ, కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి పిటిషనర్లు చేసిన అభ్యర్థనలు ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోదగ్గవి కావన్నారు. మీపై నమ్మకం లేదంటూ రాహుల్ బహిరంగంగా ఆరోపణ చేసిన నేపథ్యంలో, ఆ రోజున జరిగిన విచారణ తాలుకు రికార్డింగ్‌లను డౌన్‌లోడ్ చేసి జాగ్రత్త చేయాలని రిజిస్ట్రార్ (ఐటీ)ని న్యాయమూర్తి ఆదేశించారు. తనపై నమ్మకం లేదని రాహుల్ చౌదరి మెమో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తగిన సూచనల నిమిత్తం ఈ కేసును ప్రధానన్యాయమూర్తి ముందు ఉంచాలని ఆదేశించారు.


