అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు 14 రోజులుగా జాడలేరు. ఈనెల 3న ఓడలరేవు, కాకినాడ ప్రాంతాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఓడలరేవు తీరం నుంచి బోటు యజమాని కొపనాతి రామకృష్ణవర్మతో పాటు సంగాడి తాతారావు (బలుసుతిప్ప), కొల్లాటి ఏసుదాసు (ఆరగట్లపాలెం, బెండమూర్లంక), పాలెపు శాంతారావు (ఓడలరేవు), కర్రి రాముడు (ఎన్.రామేశ్వరం), కాటాడి సతీష్ (పశువుల్లంక, ఐ.పోలవరం మండలం), కొల్లాటి శ్రీనుబాబు (ఓడలరేవు) సముద్ర లోతు జలాల్లోకి వేటకు వెళ్లారు.
తీరం నుంచి బయలుదేరిన గంట వరకు బోటు యజమాని రామకృష్ణవర్మ ఆయన తమ్ముడు భవానీ శంకరంతో ఫోన్‌కి అందుబాటులో ఉన్నారు. గంట వ్యవధి తర్వాత రామకృష్ణవర్మ మొబైల్ నుంచి కమ్యూనికేషన్ నిలిచిపోయిందని భవానీ శంకరం తెలిపారు. తీరం నుంచి వేటకు వెళ్లి 14 రోజులు కావస్తున్నా బోటులో ఉన్న మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ విషయాన్ని మత్స్యశాఖ, మెరైన్ పోలీసులకు చెప్పామన్నారు.
ఈ ఘటనపై జిల్లా మత్స్య శాఖాధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బోటుకి ఏవైనా సాంకేతిక కారణాలు తలెత్తాయా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాకినాడలోని కోస్టుగార్డు సాయం తీసుకుని అదృశ్యమైన మత్స్యకారులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారని మెరైన్ సీఐ వీవీఎస్‌ఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.


