చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్‌ జగన్‌ | YS Jagan slams chandrababu naidu over horticulture | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్‌ జగన్‌

Oct 3 2026 8:01 PM | Updated on Oct 3 2026 8:35 PM

YS Jagan slams chandrababu naidu over horticulture

తాడేపల్లి: హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిట్టలదొర మాటలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టాలని అన్నారు. రూ. లక్ష కోట్లు కాదని, రైతులకు లక్ష మోసాలు అంటూ ట్వీట్ చేశారు. 

‘‘చంద్రబాబూ.. రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లు అంటూ మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యం. రైతుల మీద మీ ప్రేమ, మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల మీ పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్‌ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే రోజూ ధర్నాలు చేస్తే మీరు ఏరోజైనా పట్టించుకున్నారా?’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

రైతుల వెన్ను విరిచారు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెట్టిన  ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటల బీమాను తీసివేసి రైతుల వెన్ను విరిచిన మాట వాస్తవం కాదా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘‘సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీని నిర్వీర్యంచేసి, రైతుల నడ్డివిరిచారు. మీరు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప, రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్‌ తోటలు ఎండిపోతుంటే, మీరు వాటర్‌ మ్యాన్‌ అని బిల్డప్‌ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఇదీ చదవండి: నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు?

ఓ పక్క రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టుకు మీరే అడ్డుతగులుతున్నారు. మరొపక్క ఒక్క రాయలసీమ  ప్రాంతంలోనే దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో  రైతులు ట్యాంకర్‌ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక హార్టికల్చర్‌ హబ్‌ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా, రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలు పెట్టండి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement