విజయవాడ : ఏపీలో ఇప్పడంతా క్యాష్, క్యాష్, క్యాష్.. ఇదే నడుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్ కొడితేనే పని అవుతుందని విమర్శించారు. ప్రజలు భయంతో బ్రతికే రోజులు వచ్చేశాయని, టీవీ చానల్స్‌ను కూడా డబ్బు ఎరవేసి లోబరుచుకుంటున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు. ఇప్పుడు కనిపిస్తున్న చంద్రబాబు పాత చంద్రబాబు కాదని, ఇప్పుడున్నది లోకేష్ కనుసన్నల్లో పని చేసే చంద్రబాబన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో ‘రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ రంగ పరిరక్షణలో అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్‌లో చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత వడ్డే శోభనాధ్రీశ్వరరావు, మాజీమంత్రి పేర్ని నాని, ప్రొ. సి. రామచంద్రయ్య, సామాజిక కార్యకర్త డా. వసుంధర, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ.. ‘పిపిపి ద్వారా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఓటేసి గెలిపించిన జనం ఎలా పోయినా పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు పన్నులు చెల్లించాలి. .చంద్రబాబు అండ్ కో హెలికాప్టర్లలో తిరుగుతారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. ప్రైవేట్ నిర్వహణకు ఇచ్చి జీతభత్యాలు ప్రజల సొమ్ము ఇస్తామంటున్నారు. ఇంతకంటే బరితెగింపు ఏముంది?, రాజధాని మొత్తం కరెంట్ కోసం ప్రైవేట్‌కు కట్టబెట్టారు. ఏపీలో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆర్టీసీకి చెందిన 12 డిపో లను ప్రైవేట్ కు కట్టబెట్టారు. ఫ్రీ బస్ స్కీమ్ పేరుతో ఆర్టీసీకి నెలకు రూ. 150 కోట్లు ప్రభుత్వం అప్పులు పెడుతుంది.
రూ. 7 వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వంలో వైఎస్ జగన్ విలీనం చేశారు. జీతభత్యాల ఖర్చు ప్రభుత్వం భరించేలా జగన్ చర్యలు తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పీపీపీ మోడల్‌లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను పెడుతున్నారు. జీవో 74 ద్వారా రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన ప్రతీ సేవను పీపీపీకి అప్పగించేస్తున్నారు. జీతాలకేే డబ్బులన్నీ పోతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటికే రూ. 3లక్షల 95 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ప్రజల సొమ్మును వయోబులిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో దోచిపెడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ముగ్గురం కలవడం వల్లే.. చంద్రబాబు సీఎం: అయ్యన్న


