సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తమ అనుయాయులకు, బినామీ కంపెనీలకు అడ్డగోలుగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వడమే కాకుండా, పలు రాయితీల రూపంలో వందల కోట్లు దోచిపెడుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు.
గతంలో విశాఖపట్నంలో ఉర్సా లాంటి డొల్ల కంపెనీకి రూపాయికే ఎకరం చొప్పున భూములు కట్టబెట్టిన తరహాలోనే, ఇప్పుడు రాయలసీమలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మరో భారీ దోపిడీకి తెర లేపారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
బినామీ సంస్థలకు ప్రజా ఆస్తులు:
ఏర్పాటై ఏడాది కూడా పూర్తి కాని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎలాంటి అనుభవం లేని, కేవలం రూ.9 లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో రిజిస్టర్ అయిన సంస్థకు ఏకంగా రూ.1388.14 కోట్ల ప్రాజెక్టు ఆపాదించారు. ‘రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ఏపీఐఐసీకి చెందిన విలువైన 40.50 ఎకరాల భూమితో పాటు, రూ.592.22 కోట్ల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లను జీవో ఎంఎస్ 259 ద్వారా ధారాదత్తం చేశారు. అలా తమ వారి లబ్ధి కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బినామీ సంస్థలకు ప్రజల ఆస్తులను యథేచ్ఛగా దోచిపెడుతున్నారు.
రూ.9 లక్షల కంపెనీకి రూ.1400 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఎక్కడిది?:
గత ఏడాది నవంబరు 20న ప్రారంభమైన రావోక్స్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం రూ. 9 లక్షలు మాత్రమేనని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) రికార్డులే చెబుతున్నాయి. కనీసం రూ.2.5 లక్షల రుణం పొందే అర్హత కూడా లేని ఈ పసిగుడ్డు కంపెనీ ఏకంగా రూ.1388.14 కోట్ల పెట్టుబడి పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఈ కంపెనీ వెనుక ఉండి నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్న బడా బాబులు ఎవరు? కేవలం పేపర్ మీద కంపెనీ పెట్టి, ప్రభుత్వ భూములు చేజిక్కించుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పారిపోయే కుట్ర కాదా ఇది?
సర్జికల్ గ్లౌజులు చేసే వారికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది?:
ఈ సంస్థ డైరెక్టర్లకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీస అనుభవం ఉందా? వీరికున్న మరో కంపెనీ ఈజిస్ గ్లోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం ఏఎంటీజెడ్‌లో సర్జికల్ హ్యాండ్ గ్లౌజులు తయారు చేస్తుంది. గ్లౌజులు తయారు చేసే వారికి, టమోటా, మామిడి ప్రాసెసింగ్ చేసే అనుభవం ఎలా ఆపాదించారు? పైగా వీళ్ల అనుబంధ సంస్థ ’దిసూత్ర ల్యాబ్స్’ను, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభించారు.
జీవోకు ముందే రూ.1090 కోట్ల మెషినరీ ఆర్డర్లు ఎలా ఇచ్చారు?:
ఈ కంపెనీకి భూకేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు గత నెల జారీ అయ్యాయి. ఆ మేరకు జీఓ ఎంఎస్ నెం:259ని సెప్టెంబరు 25న జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన తొలుత సెప్టెంబరు 7న జరిగిన ఎస్‌ఐపీసీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలోనూ, ఆ తర్వాత 11 రోజుల అనంతరం, సెప్టెంబరు 18న జరిగిన ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో వచ్చింది. కాగా, అప్పటికే దాదాపు రెండు నెలల ముందే జూలై 1 నాటికే ఆ సంస్థ రూ.1090 కోట్ల విలువైన ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్డర్ ప్లేస్ చేసింది! నిజంగా ఆ కంపెనీకి అంత ఆర్థిక స్థోమత ఉందా? అదే నిజమైతే అంత తక్కువ మూలధన పెట్టుబడి మాత్రమే పెడతారా? లేక ఇదంతా ముందస్తు కుమ్మక్కు కాదా?
రూ.592 కోట్ల ఇన్సెంటివ్ ఎవరి జేబుల్లోకి?:
రూ.1388 కోట్ల ప్రాజెక్టు విలువలో ఏకంగా 46.61 శాతం, అంటే రూ.592.22 కోట్లను టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లుగా ప్రకటించడం విడ్డూరం కాదా? కేవలం రూ.9 లక్షల మూలధన పెట్టుబడి ఉన్న కంపెనీకి రూ.592 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా?. ఇలా 40.50 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడమే కాకుండా, వివిధ రూపాల్లో మరో రూ.592 కోట్లు ప్రభుత్వం నుంచే దోచి పెడుతుంటే ఇది బినామీ దందా కాక మరేమిటని పుత్తా శివశంకర్ నిలదీశారు.
ఇదీ చదవండి: చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్


