ఎగ్జామ్‌ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరిక | Fix Else Ill Have To Protest Again Ramdev Warns Centre Over Scams | Sakshi
Sakshi News home page

ఎగ్జామ్‌ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరిక

Aug 17 2026 12:25 PM | Updated on Aug 17 2026 12:31 PM

Fix Else Ill Have To Protest Again Ramdev Warns Centre Over Scams

హరిద్వార్‌:  భారతీయ జనతాపార్టీకి వీర విధేయుడుగా భావించే యోగా గురు బాబా రామ్‌దేవ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. విద్యా, నియామక పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు రామ్‌దేవ్‌ మద్దతుగా నిలవడమేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం విశేషం. కేంద్రం త్వరగా ఈ 'ఘప్లా' ( స్కాంలను)ను సరిదిద్దకపోతే, ఈ ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చవచ్చని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హితవుపలికారు.  లేకపోతే తాను కూడా  నిరసన చేపట్టాల్సి రావచ్చని  వ్యాఖ్యానించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతపై విద్యార్థులు నిరసన గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై అవినీతి, ధనబలం ప్రభావం చూపుతున్నాయని కూడా  ఆ సందర్భంగా ఆయన ఆరోపించారు.

దేశంలో అంతటా గందరగోళం నెలకొని ఉంది. తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కొరవడ్డాయి. కొన్నిచోట్ల మోసాలు విచ్చలవిడిగా జరుగుతుండగా, మరికొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూలలో అవినీతి 99 శాతం వరకు ఉంది. కుల, మత ప్రాతిపదికన ఎంపికలు జరుగుతున్నాయి. ఇది  రాజ్యాంగ విరుద్ధం, అత్యంత అభ్యంతరకరమైనదని రామ్‌దేవ్‌ మండిపడ్డారు.

వారికి సిగ్గుండాలి
భారత పౌరులమని చెప్పుకుంటూనే, రాజకీయ కారణాలతో లేదా కులం పేరుతో ఒకరిపై ఒకరు ద్వేషం, కక్ష పెంచుకునే వారిని ఖండిస్తున్నా అన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళితులు, ఆదివాసీలు, అటవీ ప్రాంత వాసులు, అలాగే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు... ఇలా ఒకరి రక్తం కోసం మరొకరు తహతహలాడుతున్నట్లుగా, పరస్పర శత్రుభావంతో నిలబడటం ఎంత దారుణంమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఒకవైపు 'సత్యమేవ జయతే', 'యతో ధర్మస్తాతో జయః' అని బోధిస్తూనే, మరోవైపు కోటి రూపాయల లంచం తీసుకున్న తర్వాతే నియామకాలు జరుగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందరూ నిరసనలు ప్రారంభిస్తే దేశం ఎలా నడుస్తుంది? అందుకే, ఇకనైనా పద్ధతులను మార్చుకోండి; లేకపోతే, ఆందోళన మరింత తీవ్రమవుతుందని మోదీ  సర్కార్‌ను హెచ్చరించారు.

అలాగే నిరసనలు హింసాత్మకంగా కాకుండా, రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెబుతూ, హింసకు, అరాచకానికి దూరంగా ఉండాలని జెన్ జెడ్ నిరసనకారులను రామ్‌దేవ్ కోరారు. స్కాములు జరుగుతున్నాయనేది కాదనలేని  సత్యమన్నారు.  భారతీయుల మధ్య పెరుగుతున్న శత్రుత్వాన్ని కూడా రామ్‌దేవ్ ఖండించారు. వివిధ కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడటం ప్రారంభించారని ఆయన అన్నారు. యువత తమ హక్కుల కోసం పోరాడేటప్పుడు చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించాలని, హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా 2011లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో తాను చేసిన అవినీతి వ్యతిరేక నిరసనను ఆ యోగా గురువు ప్రస్తావించారు. 

ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్‌ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement