24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్‌ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం | Dimagi Naxal Party'Instagram Page Gets Lakh Followers In 24 Hours | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్‌ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం

Aug 17 2026 11:26 AM | Updated on Aug 17 2026 11:54 AM

Dimagi Naxal Party'Instagram Page Gets  Lakh Followers In 24 Hours

దేశంలో కాక్రోచ్‌ జనతా పార్టీ  ప్రభంజనం కొనసాగుతుండగానే ‘దిమాగీ నక్సల్‌ జనతా పార్టీ ’ అనే పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు సంచలనంగా మారాయి. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్  ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.  ఈ అకౌంట్‌కు 62 పోస్ట్‌లను పోస్ట్‌ చేయగా, సుమారు 35 మందిని ఫాలో అవుతోంది. దీంతో  సీజేపీ తరహాలోనే దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే  చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  

80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ వెలుగులోకి రావడం విశేషం. మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో సాధించిన విజయాలు ,నీడలా పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ, దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇపుడిక దిమాగీ నక్సల్స్‌ను పని పడతామని తన ప్రసంగంలో మోదీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.

 

అయితే, ఈ  దిమాగీ నక్సల్‌ జనతా పార్టీ ఖాతాను ఖచ్చితంగా ఎవరు నిర్వహిస్తున్నారనే దాని గురించి ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. మరోవైపు "తెలివిగా ఉండండి.. మూర్ఖంగా ఉండకండి. ప్రశ్నలు అడగండి.. బానిసలా ఉండకండి" అంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక పోస్ట్‌ను 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' ఖాతా రీట్వీట్ చేసింది. ఇది ఇలా ఉండగా ప్రధానమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం, "నేను 'దిమాగీ నక్సల్' అయినందుకు గర్వపడుతున్నాను" అని స్పందించడం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేసింది.

కిరణ్‌ రిజుజు వివరణ
ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రకటనపై స్పష్టతనిచ్చారు. "ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను నేరుగా 'మైండ్-మేడ్ నక్సల్స్' అని పిలవలేదని, మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేవారు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు లేదా ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన భారతదేశం నుండి వేరుచేసే 'చికెన్ నెక్' ప్రాంతం దిగ్బంధనానికి మద్దతు ఇచ్చేవారిని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించాదని పేర్కొన్నారు. 

కాగా దేశ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యలకు నిరసనగా పుట్టకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ.  దీనికి సోషల్‌ మీడియాలో జెన్‌జీ నుంచి భారీ ఆదరణ లభించింది. అంతేకాదు నీట్‌ లీక్‌, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జంతర్ మంతర్  వద్ద సీజేపీ చేపట్టిన ఉద్యమం, కేంద్రమంత్రి రాజీనామా దాకా కొనసాగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement