సాక్షి, ఢిల్లీ: జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సీఎం స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించారు. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాహుల్ లేఖపై చర్చ నడుస్తోంది.
లేఖలో భాగంగా.. రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్ రాష్ట్ర రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు, వారి డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. విద్యార్థులతో ప్రభుత్వం కమిటీ ద్వారా చర్చలు ప్రారంభించడం, వారి కొన్ని డిమాండ్లను అంగీకరించడం అభినందనీయమని రాహుల్ కొనియాడారు. అయితే కొందరు విద్యార్థులు ఇంకా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
విద్యా వ్యవస్థపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు..
భారతీయ విద్యావ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకుని.. విద్యార్థుల శ్రమను దోచుకునే సాధనంగా మార్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను వినాలని, వారి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.


