పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికుడిని హతమార్చినా, సజీవంగా పట్టుకుని అప్పగించినా 30 వేల డాలర్ల నజరానా అందిస్తామని ప్రకటించింది. ఈ చర్యకు పాల్పడేది మహిళ అయితే రివార్డును రెట్టింపు చేసి 60 వేల డాలర్లు ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది.
ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ నజరానా పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. అమెరికాపై పోరాటానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు ఐఆర్‌ఎన్‌ఏ కథనాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే అమెరికా సైనికులను ఎక్కడ, ఎప్పుడు పట్టుకోవాలనే విషయంపై ఎలాంటి వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.
హార్మూజ్ ప్రతిష్ఠంభన వేళ..
హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో అమెరికా బలగాల పెద్దఎత్తున మోహరింపు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్‌లో కూలిపోయిన అమెరికా యుద్ధ విమాన పైలట్‌ను రక్షించేందుకు చేపట్టిన చర్య మినహా ఇరాన్‌లో అమెరికా బలగాల ప్రత్యక్ష మోహరింపునకు సంబంధించిన ఘటనలు పరిమితంగానే ఉన్నట్లు సమాచారం.
ట్రంప్‌పైనా గతంలో ముప్పు?
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా ఇరాన్ వైపు నుంచి గతంలో హత్యా ముప్పులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లపై కూడా అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా అమెరికా సైనికులపై నేరుగా నజరానా ప్రకటించడం.. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ప్రమాదకర దిశలోకి తీసుకెళ్లే పరిణామంగా మారింది.


