ఇరాన్‌పై యుద్ధ వ్యూహంలో తమతో కలిసిరాని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇప్పుడు మరో మిత్రదేశంపై గుర్రుగా ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతు ఇవ్వకపోవడంపై దక్షిణ కొరియాపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించారు.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ను అణు ఆయుధాల నుంచి దూరం చేసే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలా అని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ఇటీవల అడిగానని.. అందుకు సియోల్ "వద్దు, ధన్యవాదాలు" అంటూ సమాధానం ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.
సైనిక విన్యాసాలపై ట్రంప్ నిర్ణయం
దక్షిణ కొరియా నిర్ణయంతో అసంతృప్తి చెందిన ట్రంప్.. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగే వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని రక్షణ శాఖకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ (Ulchi Freedom Shield) విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోయిందని చెప్పారు. ముందుగానే ప్రణాళిక ఖరారైందని, అందుకే పూర్తిగా నిలిపివేయలేకపోతున్నామని స్వయంగా ట్రంపే తెలిపారు. ఈ సైనిక విన్యాసాలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.
ఉత్తర కొరియాపై ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై తన అసంతృప్తికి మరో కారణంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న మంచి సంబంధాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ విన్యాసాలు భారీ ఖర్చుతో కూడుకున్నవని, ఉత్తర కొరియాకు అనవసరంగా శత్రుత్వ సంకేతాలు పంపుతున్నాయని ఆయన అన్నారు. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా ఎలాంటి ముప్పు కలిగించకుండా గౌరవప్రదంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.
మాంచి స్నేహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పరస్పరం ఇద్దరు నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే 2018లో సింగపూర్‌లో జరిగిన చారిత్రక భేటీతో ట్రంప్–కిమ్ సంబంధాల్లో కీలక మలుపు వచ్చింది. ఆ తర్వాత కూడా కిమ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.
ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి వ్యూహం
ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ను అణు ఆయుధాల నుంచి దూరంగా ఉంచేందుకు మిత్రదేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా వైఖరి, అమెరికా సైనిక నిర్ణయం రెండు దేశాల మధ్య భద్రతా సహకారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఉ.కొరియా సవాల్‌కు..
ఇటు.. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గిస్తామని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆసియా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా అమెరికా-దక్షిణ కొరియా నిర్వహించే ఈ డ్రిల్స్ ఉత్తర కొరియా క్షిపణి, అణు బెదిరింపులకు ప్రతిస్పందనగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, దాని మిత్రదేశాలకు సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో సంయుక్త సైనిక విన్యాసాల తీవ్రత తగ్గితే అది కిమ్ దేశానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది.
అయితే ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో ముడిపెట్టలేదు. కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న సంబంధాలు, భారీ ఖర్చుతో కూడిన సైనిక విన్యాసాల అవసరంపై ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మరోవైపు దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా హామీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ.. డ్రిల్స్ తగ్గింపు ఉత్తర కొరియా వైఖరిపై ప్రభావం చూపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.


