ఇరాన్‌లో హై అలర్ట్‌.. గన్స్‌ పట్టిన మహిళలు! | Iranian women begin military training Videos Viral | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో హై అలర్ట్‌.. గన్స్‌ పట్టిన మహిళలు!

Oct 5 2026 7:24 AM | Updated on Oct 5 2026 7:44 AM

Iranian women begin military training Videos Viral

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఇరాన్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. సామాన్య పౌరులను సైతం యుద్ధానికి సిద్ధం చేస్తోంది ఇరాన్. ఇందులో భాగంగా రాజధాని టెహ్రాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ ఇచ్చారు. తుపాకులను ఎలా ఉపయోగించాలి? అత్యవసర పరిస్థితుల్లో తమను, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి? వంటి అంశాలపై వారికి శిక్షణ అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ హుస్సేన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సైనిక శిక్షణ కేంద్రానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ముందుగా సైనిక అధికారులు, శిక్షకులు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం హ్యాండ్‌గన్లతో సహా వివిధ ఆయుధాలను ఎలా పట్టుకోవాలి, ఎలా కాల్చాలి అనే అంశాలపై ప్రాక్టికల్‌ శిక్షణ ఇచ్చారు. ఒక రోజు ముందే హఫ్తె తిర్ స్క్వేర్‌లో మరో పౌర సైనిక శిక్షణ కేంద్రాన్ని ఇరాన్ ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడికి దిగితే ఎదుర్కొనేందుకు పౌరులను సిద్ధం చేయడమే ఈ కేంద్రాల ఉద్దేశమని అక్కడి దృశ్యాలు, నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ సందర్భంగా సైనిక శిక్షణలో పాల్గొన్న 45 ఏళ్ల రహెలె గదిరి మాట్లాడుతూ.. యుద్ధ సమయంలో తన కుటుంబాన్ని, పరిసర ప్రాంతాన్ని రక్షించుకునే సామర్థ్యం ఉంటే భయం కొంత తగ్గుతుందని చెప్పారు. అంటే.. ఈ శిక్షణలో పాల్గొంటున్న కొందరికి ప్రత్యక్ష పోరాటం కంటే, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండటమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ట్రంప్‌ హెచ్చరిక.. ఇరాన్‌ కౌంటర్‌..
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్‌పై తదుపరి చర్య విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇక తమ ముందున్న మార్గం సులభమైందా? లేదా కఠినమైనదా అన్నదే ప్రశ్న అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అనంతరం, ట్రంప్‌ వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. సైనిక చర్య లేదా కొత్త ఆంక్షలతో ఈ సంక్షోభానికి పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. తమపై మరోసారి సైనిక దాడి జరిగితే.. గతం కంటే మరింత బలంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. న్యాయం, సమానత్వం ఆధారంగా జరిగే చర్చల ద్వారానే సంక్షోభానికి ముగింపు పలకగలమని పేర్కొన్నారు. దీంతో ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు నిలిచిపోగా.. మరోవైపు ఇరాన్‌లో పౌరులకు సైనిక శిక్షణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నాడు నిరసనలు.. నేడు గన్స్‌.. 
ఇదిలా ఉండగా.. గతంలో ఇరాన్‌లోని మహిళలు ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా విమర్శలు, నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తప్పనిసరి హిజాబ్‌ నిబంధనలు, మోరాలిటీ పోలీసింగ్‌, మహిళలపై ఆంక్షలకు వ్యతిరేకంగా “ఉమెన్‌ లైఫ్‌, ఫ్రీడమ్‌” ఉద్యమంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తాజాగా కూడా టెహ్రాన్‌లోని అల్లామెహ్‌ తబాతబాయీ యూనివర్సిటీ విద్యార్థులు తప్పనిసరి హిజాబ్‌, మోరాలిటీ పోలీస్‌, రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో.. అదే దేశంలో కొందరు మహిళలు కుటుంబాలు, పరిసరాలను రక్షించుకునేందుకు తుపాకీ శిక్షణ తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో హైటెన్షన్‌.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement