పడిక్కల్‌, పంత్‌ కొంపముంచేశారు!.. కెప్టెన్‌ ఆగ్రహం.. వీడియో | IND vs NZ 1st Test Gill Furious At Pant Padikkal Drop Nicholls Catch Video | Sakshi
Sakshi News home page

పడిక్కల్‌, పంత్‌ కొంపముంచేశారు!.. కెప్టెన్‌ ఆగ్రహం.. వీడియో

Nov 19 2026 12:35 PM | Updated on Nov 19 2026 12:51 PM

IND vs NZ 1st Test Gill Furious At Pant Padikkal Drop Nicholls Catch Video

PC: Sonysports X

తొలి టెస్టులో జోరు మీదున్న భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ఇబ్బంది పెట్టారు న్యూజిలాండ్‌ బ్యాటర్లు హెన్రీ నికోల్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌. కేవలం డెబ్బై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను అనూహ్య రీతిలో పటిష్ట స్థితికి చేర్చారు.

బుమ్రాకు మూడు వికెట్లు
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు భారత జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో కివీస్‌- భారత్‌ జట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. మొదటి రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్‌ 82 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

ఆరంభంలో భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు వికెట్లతో చెలరేగగా.. అన్షుల్‌ కాంబోజ్‌, ఆకాశ్‌ దీప్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఫలితంగా మార్నింగ్‌ సెషన్‌లో న్యూజిలాండ్‌ డెబ్బై పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అయితే, వన్‌డన్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ భారత పేసర్లకు చుక్కలు చూపించాడు.

లడ్డూ లాంటి క్యాచ్‌ జారవిడిచారు
జిడ్డులా క్రీజులో పాతుకుపోయి శతకం (221 బంతుల్లో 113 నాటౌట్‌) పూర్తి చేసుకున్నాడు. అయితే, 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు.. నికోల్స్‌ను అవుట్‌ చేసేందుకు భారత్‌కు మంచి అవకాశం లభించింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో 74వ ఓవర్లో భారత పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ బంతితో రంగంలోకి దిగగా.. మూడో బంతిని నికోల్స్‌ ఎదుర్కొన్నాడు.

ఈ క్రమంలో పుల్‌ షాట్‌కు యత్నించి నికోల్స్‌ విఫలం కాగా.. బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న దేవదత్‌ పడిక్కల్‌.. బంతిని అందుకునేందుకు ముందుకు వచ్చాడు. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కూడా క్యాచ్‌ పట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పడిక్కల్‌ కాస్త నెమ్మదించగా.. అతడిని చూసి పంత్‌ కూడా ఆగిపోయాడు.

కెప్టెన్‌ ఆగ్రహం
దీంతో పడిక్కల్‌ ముందుకు ఉరికివచ్చి బంతిని అందుకునేందుకు ప్రయత్నించి.. క్యాచ్‌ జారవిడిచాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. అక్కడికి దగ్గరే ఉన్న కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా పడిక్కల్‌, పంత్‌ తీరు పట్ల చూపులతోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపే సువర్ణావకాశాన్ని మిస్‌ చేశారన్న అసహనం గిల్‌ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అయితే, అతడు ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలి రోజు ఆట ముగిసేసరికి నికోల్స్‌ 113, గ్లెన్‌ ఫిలిప్స్‌ 94 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఇదీ చదవండి: అతడు ఎప్పుడూ నిరాశపరచలేదు.. అయినా తుదిజట్టులో లేడు: టీమిండియా దిగ్గజం ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement