అతడికి తుదిజట్టులో చోటు ఎందుకు ఇవ్వలేదు: టీమిండియా దిగ్గజం ఫైర్‌ | Never Let India Down: Gavaskar Left Fuming Siraj Omission In 1st Test Vs NZ | Sakshi
Sakshi News home page

అతడు ఎప్పుడూ నిరాశపరచలేదు.. అయినా తుదిజట్టులో లేడు: టీమిండియా దిగ్గజం ఫైర్‌

Nov 19 2026 11:01 AM | Updated on Nov 19 2026 11:01 AM

Never Let India Down: Gavaskar Left Fuming Siraj Omission In 1st Test Vs NZ

సిరాజ్‌ (PC: BCCI X)

టీమిండియా యాజమాన్యం తీరుపై భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌ను ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నించాడు. అతడు జట్టును ఎల్లప్పుడూ తలెత్తుకునేలా చేశాడే తప్ప.. నిరాశపరచలేదని.. అలాంటి బౌలర్‌కు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డాడు.

టెస్టు సిరీస్‌ ఆరంభం
కాగా న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఐదు టీ20, ఐదు వన్డేల సిరీస్‌లను 3-2, 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆతిథ్య కివీస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మొదలుపెట్టింది. వెల్లింగ్‌టన్‌లోని బేసిన్‌ రిజర్వ్‌ ఇందుకు వేదిక.

ఇదిలా ఉంటే కివీస్‌తో తొలి టెస్టులో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ప్రధాన బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు తోడుగా.. ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణ, అన్షుల్‌ కాంబోజ్‌ పేస్‌ దళంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ టీమిండియా యాజమాన్యం నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఎప్పుడూ నిరాశపరచలేదు.. అతడికి చోటు ఇవ్వరా?
సోనీ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో సిరాజ్‌ను ఆడించారు. కాబట్టి తొలి టెస్టులోనూ తప్పక ఆడిస్తారని అనుకున్నా. కానీ యాజమాన్యం అతడిని పక్కన పెట్టింది. ఇది నిజంగా ఆశ్చర్యకరం. సిరాజ్‌ ఎప్పుడూ టీమిండియాను నిరాశపరచలేదు.

అవకాశం ఇచ్చిన ప్రతిసారీ జట్టు కోసం తన వంతు సహకారం అందించాడు. అతడు ఎన్నడూ జట్టును నిరాశపరచలేదు. అతడి బౌలింగ్‌లో ఎలాంటి లోపం లేదు. రిథమ్‌ కూడా బాగానే ఉంది. ఇటీవల తను మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ అతడిని తుదిజట్టులోకి ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు.

మిగతా వాళ్లు బాగా ఆడాతారేమో!
మిగతా వాళ్లు బాగా ఆడతారనే సిరాజ్‌ను విస్మరించినట్లున్నారు’’ అంటూ మేనేజ్‌మెంట్‌పై గావస్కర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇదే షోలో పాల్గొన్న న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ గావస్కర్‌ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. సిరాజ్‌ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వివరించే ప్రయత్నం చేశాడు.

అందుకే సిరాజ్‌ను కాదని అన్షుల్‌కు చోటు
‘‘అన్షుల్‌ కాంబోజ్‌ ఆక్లాండ్‌లో వన్డేలో అదరగొట్టాడు. అతడు ఊహించిన దానికంటే వేగంగా బౌలింగ్‌ చేశాడు. వీలు దొరికినప్పుడల్లా స్టంప్స్‌ను టార్గెట్‌ చేస్తూ ముందుకు సాగాడు. అందుకే తొలి టెస్టులో సిరాజ్‌ను కాదని అన్షుల్‌కు అవకాశం ఇచ్చారని అనుకుంటున్నా.

ఇది గ్రీన్‌ పిచ్‌. పచ్చికతో కూడిన వికెట్‌పై అన్షుల్‌ను ఆడించడం నిజంగానే గొప్ప సెలక్షన్‌. ఏదేమైనా సిరాజ్‌ మాత్రం నిరాశ చెంది ఉంటాడు’’ అని స్టైరిస్‌ పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, ఆకాశ్‌ దీప్, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ.

ఇదీ చదవండి: నికోల్స్‌ అద్వితీయ పోరాటం​.. భారత్‌పై సూపర్‌ శతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement