IND vs NZ: అదరగొట్టిన నికోల్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌.. భారత్‌కు ఐదు వికెట్లు | IND vs NZ 1st Test 2026 Day 1: Nichols Century India Take 5 Wickets | Sakshi
Sakshi News home page

IND vs NZ: గ్లెన్‌ ఫిలిప్స్‌, నికోల్స్‌ పోరాటం.. భారత్‌కు ఐదు వికెట్లు

Nov 19 2026 11:06 AM | Updated on Nov 19 2026 11:26 AM

IND vs NZ 1st Test 2026 Day 1: Nichols Century India Take 5 Wickets

PC: Blackcaps X/BCCI X

టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ అద్భుత రీతిలో తిరిగి పుంజుకుంది. గ్లెన్‌ ఫిలిప్స్‌తో కలిసి హెన్రీ నికోల్స్‌ ఆతిథ్య జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగలిగింది.

రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్‌టన్‌ వేదికగా న్యూజిలాండ్‌- భారత్‌ మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే భారత పేసర్లు చెలరేగారు.

ఆదిలోనే చెలరేగిన భారత పేసర్లు
ఓపెనర్లలో కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ను జస్‌ప్రీత్‌ బుమ్రా డకౌట్‌ చేయగా.. డెవాన్‌ కాన్వేను నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్‌ కాంబోజ్‌ పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్‌ రవీంద్ర (15) వికెట్‌ను ఆకాశ్‌ దీప్‌ తన ఖాతాలో వేసుకోగా.. డారిల్‌ మిచెల్‌ (1) రూపంలో మరో కీలక వికెట్‌ను బుమ్రా దక్కించుకున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ బ్లండెల్‌ (5) కూడా వెనక్కి పంపాడు.

ఫలితంగా ఉదయం సెషన్‌లో న్యూజిలాండ్‌ కేవలం 70 పరుగులు చేసి ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌, ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కలిసి అద్భుత రీతిలో పోరాడారు.

నికోల్స్‌, ఫిలిప్స్‌ సంచలనం
నికోల్స్‌ శతక్కొట్టగా.. ఫిలిప్స్‌ సెంచరీకి చేరువయ్యాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి నికోల్స్‌ 221 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 113 పరుగులు.. ఫిలిప్స్‌ 182 బంతుల్లో 13 ఫోర్లు బాది 94 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అబేధ్యంగా 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

మొత్తానికి తొలి రోజు 82 ఓవర్ల ఆట మాత్రమే సాగగా.. ఐదు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 243 పరుగులు చేసింది. ఆదిలో తడబడ్డా నికోల్స్‌, ఫిలిప్స్‌ పోరాటం వల్ల ఒక రకంగా మొదటి రోజు టీమిండియాపై పైచేయి సాధించగలిగింది.

తుదిజట్లు
భారత్‌
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, ఆకాశ్‌ దీప్, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ.

న్యూజిలాండ్‌
టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, నాథన్‌ స్మిత్‌, కైలీ జెమీషన్‌, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ.

ఇదీ చదవండి: అతడు ఎప్పుడూ నిరాశపరచలేదు.. అయినా తుదిజట్టులో లేడు: టీమిండియా దిగ్గజం ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement