గెలుపు బాటలో ఉన్న పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ | Pakistan Saqib Khan Ruled Out Of Ongoing Second Test vs Sri Lanka | Sakshi
Sakshi News home page

గెలుపు బాటలో ఉన్న పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ

Nov 19 2026 12:08 PM | Updated on Nov 19 2026 12:08 PM

Pakistan Saqib Khan Ruled Out Of Ongoing Second Test vs Sri Lanka

source: X

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో గెలుపు బాటలో పయనిస్తున్న ఆతిథ్య పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఇన్‌ ఫామ్‌ పేసర్ సాకిబ్ ఖాన్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు రెండో ఇన్నింగ్స్‌లో ఇక బౌలింగ్ చేయలేడని పాక్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది.

బుధవారం బౌలింగ్‌ చేస్తున్న సమయంలో సాకిబ్ అసౌకర్యానికి గురై మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లు లంక బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలిచే అవకాశమున్న తరుణంలో సాకిబ్ అందుబాటులో లేకపోవడం పాక్‌కు ఇబ్బంది కలిగించే పరిణామం.

సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాకిబ్ ఖాన్‌వే
ఈ సిరీస్‌లో సాకిబ్ ఖాన్‌వే అత్యధిక వికెట్లు. తొలి టెస్ట్‌లో 7 వికెట్లు సహా ప్రస్తుత రెండో టెస్ట్‌లో 2 వికెట్లు తీశాడు. గాయపడిన రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ సిరీస్‌లో మొత్తంగా అతడు 9 వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 227 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక ఈ ఇన్నింగ్స్‌లోనూ తడబడుతుంది. మూడో రోజు తొలి సెషన్‌ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి ఇంకా 84 పరుగులు వెనుకపడి ఉంది. కుసాల్‌ మెండిస్‌ (23), సోనల్‌ దినుషా (5) లంకను ఇన్నింగ్స్‌ పరాజయం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

325 పరుగులకు ఆలౌట్‌
అంతకుముందు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఘాజీ ఘోరీ (54) అర్ద సెంచరీతో రాణించగా.. అజాన్‌ అవైస్‌ (47), తయ్యబ్‌ ఆరిఫ్‌ (46), సాకిబ్‌ ఖాన్‌ (37), రజావుల్లా (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో లహీరు కుమార్‌ 5 వికెట్లు పడగొట్టగా.. అసిత ఫెర్నాండో 3, మిలన్‌ రత్నాయకే, ప్రభాత జయసూర్య తలో వికెట్‌ దక్కించుకున్నారు.

98 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
పాక్‌ బౌలర్లు తలో చేయి వేయడంతో లంక ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. మొహమ్మద్‌ అబ్బాస్‌, రజావుల్లా, ఆమిర్‌ జమాల్‌ తలో 3 వికెట్లు తీయగా.. సాకిబ్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ మెండిస్‌ (32), సోనల్‌ దినుషా (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: శ్రీలంకతో రెండో టెస్ట్‌.. పాక్‌కు భారీ ఆధిక్యం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement