న్యూఢిల్లీ: అండమాన్, నికోబార్ దీవుల్లోని జైళ్ల వ్యవస్థలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. బ్రిటిష్ కాలం నాటి 132 ఏళ్ల పురాతన జైళ్ల చట్టానికి స్వస్తి పలుకుతూ కొత్త సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చారు. ‘అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ రెగ్యులేషన్-2026’ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు పాత జైళ్ల చట్టాలు, ఖైదీల బదిలీకి సంబంధించిన నిబంధనల స్థానంలో అమల్లోకి రానున్నాయి. 1894 నాటి ప్రిజన్స్ యాక్ట్, 1900 నాటి ప్రిజనర్స్ యాక్ట్, 1950 నాటి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్‌లను కొత్త చట్టం భర్తీ చేయనుంది. ఖైదీలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడంతోపాటు వారి మానవ హక్కులు, గౌరవానికి ప్రాధాన్యమివ్వనున్నారు. ఓపెన్, సెమీ ఓపెన్ జైళ్లను ఏర్పాటు చేసి విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందించనున్నారు.
జైళ్ల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వ్యవస్థలు, ఆర్‌ఎఫ్‌ఐడీ, డిజిటల్ రికార్డులు, వీడియో కాన్ఫరెన్సింగ్, మొబైల్ జామర్లను ఉపయోగించనున్నారు. జైళ్లలో నిషేధిత ఫోన్లు, సమాచార పరికరాలు కలిగి ఉంటే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. గర్భిణి ఖైదీలకు వైద్య సదుపాయాలు, లైంగిక వేధింపుల ఫిర్యాదులపై చర్యలు తీసుకోనున్నారు. తల్లులతో ఉండే ఆరేళ్లలోపు పిల్లలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగ ఖైదీలకు ప్రత్యేక వసతి, వైద్యం, మానసిక సహాయం అందిస్తారు. కుల ఆధారిత వివక్ష, పనుల కేటాయింపును నిషేధించారు.
ఖైదీలకు న్యాయ సహాయం, మానసిక ఆరోగ్య సంరక్షణ అందించనున్నారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడేందుకు అనుమతిస్తారు. విదేశీ ఖైదీలు తమ దేశ దౌత్య కార్యాలయాలను సంప్రదించవచ్చు. దీర్ఘకాలంగా జైళ్లలో ఉన్న విచారణ ఖైదీల కేసులను సమీక్షించేందుకు ప్రతి జిల్లాలో జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తారు. అర్హులైన ఖైదీలకు పెరోల్, ఫర్లో, ముందస్తు విడుదల అవకాశాలనూ పరిశీలిస్తారు. జైళ్లలో మరణాలపై నివేదిక తప్పనిసరి చేయడంతోపాటు అధికారుల బాధ్యతలను నిర్దేశించారు.
ఇదీ చదవండి: Bangladesh: యూనుస్ ఇంటికి నిప్పు.. దేశమంతటా హింస!


