బ్లూ ఎకానమీ వృద్ధికి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి
టూనా చేపల ఉత్పత్తిని 50 వేల టన్నులకు పెంచాలని నిర్ణయం
దీవుల మత్స్య రంగంలో రూ.393 కోట్ల పెట్టుబడులు
కేంద్ర పశు సంవర్థక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ సముద్ర ఆర్థిక వ్యవస్థ(బ్లూ ఎకానమీ)ను మరింత బలోపేతం చేయడంతోపాటు మత్స్య సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. టూనా చేపల వేట, సముద్రపు నాచు సాగు, అలంకరణ చేపల పెంపకం వంటి అధిక విలువ కలిగిన రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా దీవుల ప్రజలకు ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అండమాన్ నికోబార్ దీవులకు రూ.218 కోట్లు, లక్షద్వీప్‌కు రూ.175 కోట్ల పెట్టుబడులు కేటాయించారు. ఈ విషయాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్దక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉత్పత్తి సామర్థ్యం 58.6 లక్షల మెట్రిక్ టన్నులు
భారత్‌కు సుమారు 11,099 కిలోమీటర్ల సముద్ర తీరం, దాదాపు 24 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది. ఇందులో సముద్ర మత్స్య సంపద ఉత్పత్తి సామర్థ్యం సుమారు 58.6 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా. దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధికి ఈ రంగమే ఆధారం. ఆహార భద్రత, పోషకాహారం, ఉపాధి, ఎగుమతులకు కీలకంగా నిలుస్తోంది. 2025–26లో భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.73,890 కోట్లకు చేరింది. 2015 నుంచి మత్స్య రంగ అభివృద్ధికి కేంద్రం వివిధ పథకాల ద్వారా రూ.39,272 కోట్ల పెట్టుబడులను సమకూర్చింది.
అండమాన్ నికోబార్‌లో ప్రత్యేక టూనా క్లస్టర్
భారత ప్రత్యేక ఆర్థిక మండలిలో దాదాపు 40 శాతం విస్తీర్ణాన్ని లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు కలిగి ఉన్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో విస్తరించిన ఈ ప్రాంతాలు టూనా చేపల వేటకు అనుకూలంగా ఉన్నాయి. లక్షద్వీప్‌లో ఐదేళ్ల ప్రణాళిక ద్వారా టూనా ఉత్పత్తిని రెట్టింపు చేసి 50 వేల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. అండమాన్ నికోబార్‌లో ప్రత్యేక టూనా క్లస్టర్ ద్వారా నౌకల ఆధునికీకరణ, కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. టూనా చేపల ఉత్పత్తితోపాటు సముద్రపు నాచు సాగు, అలంకరణ చేపల పెంపకాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు. లక్షద్వీప్‌ను ప్రత్యేక సీవీడ్ క్లస్టర్‌గా గుర్తించి, విత్తన బ్యాంకులు, హ్యాచరీలు, భారీ స్థాయి సాగు, శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నారు. చేపల ల్యాండింగ్ కేంద్రాలు, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌లు, చేపల నిల్వ సదుపాయాలు, ఫిష్ అగ్రిగేటింగ్ పరికరాలు, పడవల తయారీ కేంద్రాలు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల యూనిట్లను అభివృద్ధి చేయనున్నారు.


