మోడీ ప్రభుత్వ పునాదులు కదిలాయి.. | Ground has shifted under Modi government feet | Sakshi
Sakshi News home page

మోడీ ప్రభుత్వ పునాదులు కదిలాయి..

Nov 12 2026 6:29 AM | Updated on Nov 12 2026 6:29 AM

Ground has shifted under Modi government feet

ఎక్కువ కాలం ఉండదు

యువత పారదర్శకత కోరుతోంది

మోదీ, బీజేపీ మాటలు విశ్వసించడం లేదు

ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి

న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పునాదులు కదిలిపో యాయని, ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌ప ర్సన్‌ సోనియాగాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో పేర్కొన్నారు. హార్పర్‌ కాలిన్స్‌ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం మంగళవారమే విడుదలైన విషయం తెలిసిందే. అందులోని అంశాలపై ఇప్పటికే పలు విస్తృత కథనాలు ప్రచురితం కాగా.. మరిన్ని వెలుగు చూస్తున్నాయి. నరేంద్రమోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ ఏం రాశారంటే.... 

‘‘కొత్త తరం పారదర్శకత కోరుకుంటోంది. అన్యాయం, అణచివేతలను సహించడం లేదు. కొంత సమయం తీసుకోవచ్చునేమో కానీ.. చక్రం తిరుగుతుంది. వాళ్లు విజయం సాధిస్తారు. ఈ దేశపు ఆత్మను పునరుజ్జీవింపచేస్తారు. గాయాలను మాన్పుతారు.’’అని. 

ఎన్నో కష్టాలకు ఓర్చి సాధించుకున్న స్వాతంత్య్రం, జాగ్రత్తగా అభివృద్ధి చేసుకున్న సామరస్యాలను ఈ దేశ యువతీ యువకులు కాపాడతారని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం తనకున్న ప్రజాదరణ యథాతథంగా ఉందని చెబుతుంది. కానీ పునాదులు కదిలాయి అన్నది నా విశ్వాసం. దేశంలోని ప్రధాన మీడియా ఏకపక్షంగానే ఉంది. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే దాని అభద్రతతను బయటపెడుతున్నాయి’’అని వివరించారు. ఇటీవలి కాలంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయనేందుకు బలమైన ఆధారాలున్నాయని సోనియా చెప్పారు. ‘‘పార్లమెంటులో ప్రభుత్వం చైనా దురాక్రమణ, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకుంటున్న చట్టాలు, మైనారిటీ హక్కులు, వ్యక్తుల ప్రైవసీ, వంటి అనేకానేక కీలక అంశాలపై చర్చను ఈ ప్రభుత్వం దాటవేస్తోంది. అదే సమయంలో అధికారిక వివరణలను ఏమాత్రం నమ్మశక్యంగా ఉండటం లేదు. ప్రజలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, పెచ్చుమీరిన అవినీతికి ప్రభావితమవుతున్నారు కానీ.. మాట్లాడేందుకు భయపడుతున్నారు.’’అన్నారు.

బీజేపీ పాలన ప్రభావంపై...
పన్నెండేళ్ల భారతీయ జనతా పార్టీ పాలనపై సోనియా స్పందిస్తూ.. నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజల తిరుగుబాటును మరింతగా అణచివేసే ప్రయత్నం చేస్తాయని, ప్రస్తుతం దేశంలో అదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ‘‘..అయితే ఈ ప్రభుత్వం కొనసాగేది కాదు. అధికార దుర్వినియోగం పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఫలితంగా ప్రభుత్వం కూలిపోతుంది. శతాబ్దం క్రితం ప్రపంచమంతా వ్యాపించిన బ్రిటిష్‌ సామ్రాజ్యం అంతరిస్తుందని ఎవరైనా ఊహించారా? ధోతి మాత్రమే తొడుకున్న ఓ బక్కప్రాణి కోట్లాది మంది ప్రజలను ఏకం చేసి అంతటి మహా సామ్రాజ్య శక్తిని నాశనం చేస్తాడని అనుకున్నారా?’’అని వ్యాఖ్యానించారు. అలాగే 70 ఏళ్ల క్రితం కడు పేదరికంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న దేశంలో ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంటుందని కూడా ఎవరూ అనుకోలేదని, హోదాలతో విభజితమైన సమాజంలో అందరికీ సమాన ఓటు హక్కు కల్పిస్తుందని.. ప్రజాస్వామ్యం కొనసాగుతుందన్న నమ్మకమే దీర్ఘకాలంలో దేశానికి రక్ష అని కూడా అంచనా వేయలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను విభజించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దేశ వైవిధ్యత ముందు ఆ ప్రయత్నాలు సాగవని అన్నారు. దేశంలో ఒక భాష, ఒకే మతం ఉండే దిశగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తోందన్న విషయం తనకు తెలుసునని, అయితే వీటికి గట్టి ప్రతిఘటన ఎదురవుతుందని చెప్పారు.

2024 ఫలితాలతో షేక్‌..
2024 నాటి ఎన్నికల సమయంలో ఇండియా కూటమికి ప్రజాదరణ పెరుగుతూండటంతో బీజేపీ షేక్‌ అవడం మొదలైందని సోనియా తెలిపారు. ‘‘ప్రధాని తటపటాయించడం మొదలుపెట్టారు. మళ్లీ మొరటు ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. మైనార్టీలతో ముప్పు అని తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రసంగాల్లో బెదిరింపులు పెరిగాయి. సంబంధం లేని మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. నాన్‌ బయలాజికల్‌నని చెప్పుకున్నాడు. ఒకానొక ఇంటర్వ్యూలో తాను దైవాంశ సంభూతుడినని కూడా చెప్పుకున్నారు’’అని విమర్శించారు. దేశ ప్రజలకు ఇవన్నీ అర్థమవుతున్నాయని, మోదీ మాటలు పట్టించుకోకుండా.. ఇండియా కూటమి ఏం చెబుతోందో వినే ప్రయత్నం చేశారని అన్నారు. ఫలితాలు వెలువడిన రోజు మోదీ ప్రయత్నాలన్నింటినీ అధిగమించి ఇండియా కూటమి గణనీయమైన ఫలితాలు సాధించిందని అర్థమైంది. అందుకు రాహుల్, ప్రియాంకలను అభినందించాను అని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement