కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారంటీ సపోర్ట్ కొనసాగింపు
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం నిర్మాణానికి రూ.3,230 కోట్లు
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘యుగే యుగీన్ భారత్’
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ దేశీయంగా రైతులపై ఎలాంటి భారం పడకుండా డైఅమ్మోనియం ఫాస్ఫేట్(డీఏపీ), పొటాష్ ఎరువులను పాత ధరలకే అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2026–27 రబీ సీజన్‌లో న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ(ఎన్‌బీఎస్) కింద ఎరువులకు రూ.62,370 కోట్ల భారీ సబ్సిడీ ప్యాకేజీని ప్రకటించింది. గతేడాది రబీ సీజన్‌లో ఇచ్చిన రూ.37,952 కోట్ల రాయితీతో పోలిస్తే ఇది 64 శాతం ఎక్కువ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
రైతులకు అందుబాటులో ఎరువులు
బహిరంగ మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నప్పటికీ రైతులకు కేవలం రూ.1,350లకే డీఏపీ బస్తా అందించేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డీఏపీకి వర్తించే ఈ ప్రత్యేక నిబంధనలనే దిగుమతి చేసుకున్న, అలాగే దేశీయ ట్రిపుల్ సూపర్‌ఫాస్ఫేట్(టీఎస్‌పీ)పై, దిగుమతి చేసుకున్న మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్(ఎంఏపీ)లకు సైతం వర్తింపజేసింది. ప్రతి కిలో నైట్రోజన్‌కు రూ.94.21, పాస్ఫరస్ రూ.66.11, పొటాషియంకు రూ.2.38, సల్ఫర్‌కు రూ.10.42 చొప్పున రాయితీని ఖరారు చేసింది. డీఏపీకి ప్రత్యామ్నాయంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్(ఎస్‌ఎస్‌పీ) ఉపయోగించేలా రైతులను ప్రోత్సహించడానికి దానిపై రవాణా రాయితీని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే దేశీయంగా అమ్మోనియం సల్ఫేట్‌పై సబ్సిడీని కూడా కొనసాగిస్తోంది.
స్వయం ఉపాధికి రుణాలు
దేశంలో చిన్న వ్యాపారాలను, స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రెండు కీలక పథకాలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ముద్రా యోజన కింద మైక్రో యూనిట్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ మరో ఐదేళ్లపాటు రూ.5 వేల కోట్ల వ్యయంతో కొనసాగుతుంది. పీఎం ముద్రా యోజన(పీఎంఎంవై) కింద రూ.20 లక్షల వరకూ, పీఎంజేడీవై ఓవర్‌డ్రాఫ్ట్‌లు రూ.10 వేల వరకూ, ఎస్‌హెచ్‌జీ రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఎలాంటి పూచీకత్తు లేకుండా ఎప్పటిలాగే అందుతాయి. అయితే, గ్యారంటీ ఫీజును ఒక శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాండ్–అప్ ఇండియా పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించారు.
దేశీయ గణాంక వ్యవస్థ ఆధునీకీకరణ
భారత గణాంక వ్యవస్థ(డేటా)ను కృత్రిమ మేధ(ఏఐ), మెíషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో అనుసంధానిస్తూ డేటా ఆధారిత పాలన, పరిశోధనలను బలోపేతం చేసేందుకు వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టాటిస్టికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అనలిటిక్స్ అండ్ రీసెర్చ్(విస్తార్) ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026–27 నుంచి 2030–31 వరకూ ఐదేళ్ల పాటు రూ.4,371.10 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
నోయిడా మెట్రో విస్తరణ
దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్)లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి నోయిడా సెక్టార్ 51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్ 4 వరకూ రూ.2,390 కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


