ప్రధాని మోదీ టీ తాగిన ఇంట్లో.. ఆర్థిక వేధింపులు! | Financial harassment at the house where Modi drank tea | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ టీ తాగిన ఇంట్లో.. ఆర్థిక వేధింపులు!

Nov 10 2026 12:49 PM | Updated on Nov 10 2026 1:00 PM

Financial harassment at the house where Modi drank tea

అయోధ్య: 2023 డిసెంబర్ 30.. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సామాన్యురాలి ఇంటికి అనూహ్యంగా వెళ్లారు. ఉజ్వల యోజనలో 10 కోట్లవ లబ్ధిదారురాలిగా నిలిచిన మీరా మాంఝీ ఇంట్లో టీ తాగి ఆమె కుటుంబాన్ని పలకరించారు. అప్పట్లో ఈ పర్యటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ ఇప్పుడు అదే కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మీరా మాంఝీ గతంలో అయోధ్యలోని ఘాట్ వద్ద పూలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఆమె భర్త సూరజ్ కుమార్ మాంఝీ కూలి పనులు చేసేవారు. ప్రధాని పర్యటన తర్వాత జిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులు సహా పలువురు తమ ఇంటికి వచ్చారని మీరా తెలిపారు. తనకు పూలు అమ్ముకునేందుకు శాశ్వత స్థలం, భర్తకు పడవ తయారు చేయించుకునేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే ఉద్యోగం కల్పించాల్సిందిపోయి రుణం తీసుకోవాలని సూచించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగం అడిగితే.. అప్పు ఇచ్చారు!
ప్రభుత్వం నుంచి తాము డబ్బులు అడగలేదని, జీవనోపాధి కల్పించాలని మాత్రమే కోరామని మీరా వెల్లడించారు. పూలు అమ్ముకునేందుకు కేటాయించిన స్థలంలో వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేలు చెల్లించాల్సి వచ్చిందని కూడా ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని, చివరకు పూల వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

పడవ ఆదాయం సరిపోక.. పెరిగిన అప్పులు
భర్త పడవ నడుపుతూ సంపాదిస్తున్నప్పటికీ వరదలు, ఇతర పరిస్థితుల కారణంగా ఆదాయం క్రమంగా తగ్గిందని మీరా తెలిపారు. అయోధ్య నుంచి వారణాసి వరకు నడుస్తున్న పెద్ద క్రూయిజ్‌లు, మోటార్ బోట్ల కారణంగా సంప్రదాయ పడవ నడిపేవారి వ్యాపారాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద సూరజ్‌కు రెండు విడతల్లో రూ.2,61,250, రూ.23,750 రుణంగా మంజూరయ్యాయి. ఈ డబ్బుతో పడవ తయారు చేయించుకున్నారు. అయితే రూ.2,04,616 బకాయి చెల్లించలేకపోవడంతో రుణం నిరర్థక ఆస్తిగా మారింది. 2026 జులై 5న బ్యాంకు నోటీసు జారీ చేసినట్లు బీబీసీ హిందీ కథనం పేర్కొంది.

ముగ్గురు పిల్లలతో అప్పుల బాధలు
అక్టోబర్ 28న ఉత్తరప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శరద్ శుక్లా నిర్వహించిన మీడియా సమావేశంలో మీరా దంపతులు తమ సమస్యలను వెల్లడించారు. ముగ్గురు పిల్లలతో ఉన్న ఈ కుటుంబం కనీస అవసరాలు తీర్చుకోవడానికీ ఇబ్బంది పడుతోందని, రుణ వసూలు ఏజెంట్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోందని శుక్లా ఆరోపించారు. కాగా మీరాకు సమాజ్‌వాదీ పార్టీ మాజీ మంత్రి పవన్ పాండే రూ.50 వేలు, అయోధ్య బీజేపీ మేయర్ గిరీశ్ పతి త్రిపాఠి రూ.60 వేలు ఆర్థిక సాయం అందించినట్లు తెలుస్తున్నది.

కాగా ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు అనవసర వివాదం సృష్టిస్తున్నాయని మేయర్ త్రిపాఠి అన్నారు. ప్రధాని పర్యటన తర్వాత ఆ కుటుంబానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ యోజన కింద ఆరోగ్య కార్డు అందించామని వివరించారు. పడవ మరమ్మతుల కోసం పీఎం స్వనిధి కింద రూ.25 వేల రుణం, మరో రూ.3 లక్షల రుణం కూడా మంజూరైనట్లు తెలిపారు. ఇందులో రూ.75 వేల సబ్సిడీ ఉందని, మిగిలిన రుణ వాయిదాలు చెల్లించలేక కుటుంబం ఇబ్బంది పడుతోందని చెప్పారు.

ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు ఏడాది.. ఎన్‌ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement