సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు, పథకాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.77,101 కోట్లకు పైగా నిధుల కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం నిర్మాణం, నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణ, ఎరువుల సబ్సిడీ, సూక్ష్మ పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ వంటి అంశాలు ఉన్నాయి.
కీలక కేటాయింపులు ఇవే..
కేంద్ర కేబినెట్ ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం ఏర్పాటుకు రూ.3,230 కోట్లు, నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు రూ.2,390 కోట్ల నిధులు , అలాగే రబీ 2026-27 సీజన్‌కు ఎరువుల సబ్సిడీ కోసం రూ.62,370 కోట్లు కేటాయించింది. అంతేకాదు సూక్ష్మ పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.5,000 కోట్లు, స్టాండ్ అప్ ఇండియా పథకం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.4,111 కోట్లను ఆమోదించింది.
నోయిడా మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్
నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆక్వా లైన్ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు మొత్తం 8.449 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో ఐదు ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇక ఈ విస్తరణ పూర్తయితే నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని మొత్తం మెట్రో నెట్‌వర్క్ 71.878 కిలోమీటర్లకు చేరుకోనుంది. నోయిడా సెక్టార్-61 వద్ద బ్లూ లైన్ మెట్రోతో ఇంటర్‌చేంజ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
ప్రధాన వాణిజ్య ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ
కొత్త మెట్రో కారిడార్‌తో గౌర్ సిటీ, గౌర్ సిటీ మాల్స్, బ్లూ సఫైర్ మాల్, ఐకియా వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది. అంతేకాకుండా ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రధాన నివాస ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. వాహనాల వినియోగం తగ్గడంతో వాయు కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించేందుకు కూడా దోహదపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో మెట్రో విస్తరణతో వాణిజ్య కార్యకలాపాలు, పెట్టుబడులు పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి


