ప్రతీకాత్మక చిత్రం
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మనిషి గంటలో చేసే పనిని నిమిషంలో చేసే సహాయకారి. ఏఐ కత్తి వంటి సాంకేతిక సాధనం. ప్రాణం పోయవచ్చు– ప్రాణం తీయవచ్చు. ఈ సాంకేతికతను మానవ కల్యాణానికి ఉపయోగించడం విజ్ఞత. అది ఇప్పుడు మోసగాళ్ల చేతిలో పావులా మారింది. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడే వాళ్లు ఏఐ ఆధారంగా నకిలీ ఫొటో, ప్రొఫైల్ సృష్టిస్తున్నారు. గొంతును మార్చి మాట్లాడుతూ అమాయకులను ప్రలోభపెట్టి డబ్బు గుంజుతున్నారు.
ఏఐ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లు!
ఏఐ టెక్నాలజీతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లు మాయాజాలాన్ని సృష్టిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు తమను తాము గొప్ప ఉద్యోగులుగా, ఉన్నత స్థానంలో ఉన్నట్లు చూపించుకోవడానికి ఏఐని విరివిగా వాడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఫొటోలను సిద్ధం చేస్తున్నారు. అబద్ధాలతో చక్కటి నకిలీ ప్రొఫైల్ తయారు చేసి, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు గుజరాత్‌లో హిమాన్షు పంచాల్ కృత్రిమ మేధ సాయంతో తాను గుజరాత్ పోలీస్ సబ్–ఇన్‌స్పెక్టర్ అయినట్లు ఫొటోలు సృష్టించాడు. వాటిని ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్లలో పెట్టి సృష్టించి 20 మందికి పైగా యువతులను మోసం చేశాడు.
వాయిస్ చేంజింగ్ టెక్నాలజీ!
ముంబైకి చెందిన ఓ వ్యక్తి కేవలం ఫొటోలతోనే కాకుండా, ఏఐలో వాయిస్ చేంజింగ్ టెక్నాలజీని ఉపయోగించి మహిళ గొంతుతో మాట్లాడి డాక్టర్లను, ఇతరులను నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. కాన్పూర్ లాంటి ప్రాంతాల్లో ఏకంగా మ్యారేజ్ బ్యూరోలే వెలిశాయి. ఈ నకిలీ మ్యారేజ్ బ్యూరోలు ఏఐ సృష్టించిన అందమైన అమ్మాయిల ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించారు. టెలికాలర్లను పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు, వెరిఫికేషన్ పేర్లతో వేలాది మంది మగవాళ్ల నుంచి కోట్లు వసూలు చేశారు. తమ ఉద్యోగులతోనే వరుడు, వధువుల తల్లిదండ్రుల లాగా ఫోన్‌లో మాట్లాడిస్తారు. తమ దగ్గర ఇంకా మంచి ప్రొఫైల్‌లున్నాయని మరికొంత ఫీజు చెల్లిస్తే వాటిని షేర్ చేస్తామని డబ్బు గుంజుతారు.
మోసాల వెనుక వ్యూహం!
వరుడు, వధువుల ప్రొఫైల్స్ ఆకర్షణీయంగా సృష్టిస్తారు. సమాజం ఇప్పుడు ఏం కోరుకుంటుందో ఆ నమూనాలోనే తయారు చేస్తారు. మంచి ఉద్యోగం, విదేశాల్లో సెటిల్ కావడం, ఆకర్షణీయమైన రూపంతో నకిలీ ప్రొఫైల్స్ తయారు చేసి అవతలి వారికి నమ్మకం కుదిరిన తర్వాత అసలు నాటకం మొదలు పెడతారు. మోసగాళ్లు అవతలి వారితో (బాధితులతో) ప్రేమగా మాట్లాడుతూ వారితో వైవాహిక జీవితం కోసం ఉవ్విళ్లూరుతున్నట్లు నమ్మిస్తారు. కొంతకాలానికి కల్లబొల్లి కథనాలతో డబ్బు గాలాన్ని బయటకు తీస్తారు.
డబ్బుల డిమాండ్!
ఏదో అత్యవసర పరిస్థితి అని, వ్యాపారంలో నష్టపోయామని లేదా చట్టపరమైన సమస్యలు వచ్చాయని చెప్పి రకరకాల కారణాలతో బాధితుల నుంచి విడతల వారీగా లక్షలాది రూపాయలు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటారు. డబ్బు ఇవ్వడం ఆలస్యమైతే ‘నా మాటలను నమ్మడం లేదా’ అంటూ భావోద్వేగాల పరీక్ష పెడతారు. డబ్బు అందిన తర్వాత నంబర్ బ్లాక్ చేయడంతో తాము మోసపోయామని బాధితులకు స్పష్టమవుతుంది.
విమానాశ్రయం నిబంధనల పేరుతో కట్టుకథ!
తాను విదేశాల్లో ఉన్నట్లు వధువును నమ్మించిన ఓ వరుడు డబ్బు లాగడానికి విమానాశ్రయాన్ని వాడుకున్నాడు. కొంతకాలం ఆన్‌లైన్ చాటింగ్ తర్వాత ఇరువురూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇక వరుడి మోసం మరో మెట్టుకి చేరింది. వధువును చూడడానికి (పెళ్లి చూపులు) ఇండియాకి వస్తున్నట్లు కొంతకాలం కథ నడిచింది. ఇండియాకి బయలుదేరినట్లు, ఫ్లయిట్ దిగినట్లు చాటింగ్, కొద్ది గంటల విరామం, ఆ తర్వాత వధువుకి అపరిచిత మహిళ నుంచి ఫోన్ కాల్. ఆమె తనను ‘ఢిల్లీ విమానాశ్రయ ఉద్యోగి’గా పరిచయం చేసుకుంది. ‘వ్యక్తి (వరుడి) దగ్గర విదేశీ కరెన్సీ ప్రకటించిన మొత్తం కంటే ఎక్కువ ఉంది. కాబట్టి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు’ సమాచారం. ఆ ఆందోళన నుంచి తేరుకునేలోపే ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకుంటూ మరికొన్ని ఫోన్ కాల్స్. జీఎస్టీ, వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఐఎమ్‌ఎఫ్ ధ్రువీకరణ, వీసా పునరుద్ధరణ వంటి కారణాలు చెప్పి డబ్బు అడగడం, ఆమె (వధువు) చెల్లించిన ప్రతి రూపాయీ తిరిగి వస్తుందని నమ్మబలకడం జరిగాయి. వాళ్లు అడిగినంత డబ్బు ఆమె బదిలీ చేసింది, కానీ ఆమెకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు.
నిపుణుల హెచ్చరికలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( ఐ4సి) దీనిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది అతి పెద్ద వ్యవస్థీకృత నేరంగా మారుతోందని, గతంలోలాగ దీనిని కేవలం ఆన్‌లైన్ మోసంగా మాత్రమే పరిగణించరాదని పేర్కొంది.
ఇదీ చదవండి: మాంసం తినండి.. పర్యావరణాన్ని కాపాడండి
వ్యక్తిగత ధ్రవీకరణ చాలా ముఖ్యం. పెళ్లి సంబంధం పేరుతో ఆన్‌లైన్‌లో పరిచయమైన వారితో ఎంత సాన్నిహిత్యం ఏర్పడినప్పటికీ, వారి తల్లిదండ్రులు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యం వంటి వివరాలను కచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిందే.
డబ్బు అడిగారంటే సందేహించి తీరాల్సిందేనంటున్నారు సైబర్ క్రైమ్ సలహాదారులు. పెళ్లి కుదిరిపోయింది కాబట్టి, ఒకరికి డబ్బు అవసరమైతే రెండో వారు సహాయం చేయాలి కదా అనే ప్రలోభవచనాలను నమ్మరాదు. డబ్బు ప్రస్తావన వస్తే వెంటనే అప్రమత్తమై వారిని దూరం పెట్టాలి.
ఫిర్యాదు చేయడం పౌరుల బాధ్యత. మోసపోయామని గుర్తిస్తే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఈ మోసగాళ్ల వలలో మరికొందరు అమాయకులు బలవుతారు. కాబట్టి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.
పెరుగుతున్న ఆన్‌లైన్‌లో పెళ్లి మోసాలు!
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం 2024లో 854 మోసాలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: క్లాసికల్ మ్యూజిక్‌తో బ్రెయిన్ మ్యాజిక్
2025 నాటికి 1,128 ఫిర్యాదులు అందాయి. అయితే ఈ లెక్కలు తాము మోసపోయాయని గొంతెత్తిన వారి సంఖ్య. మోసానికి గురయ్యి, మౌనంగా ఉండిపోయిన కేసులు అనేకం. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, నేరగాళ్లు దానిని నేరాలకు ఉపయోగించే విధానం కూడా అంతే వేగంగా మారుతోంది. మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.


