కోడింగ్ కంటే ఇదే కీలకం.. జెటా సీఈఓ కీలక సూచనలు! | Zeta CEO Explains Why AI is Changing Tech Careers | Sakshi
Sakshi News home page

కోడింగ్ కంటే ఇదే కీలకం.. జెటా సీఈఓ కీలక సూచనలు!

Nov 7 2026 10:54 AM | Updated on Nov 7 2026 11:03 AM

Zeta CEO Explains Why AI is Changing Tech Careers

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం కావాలంటే.. తప్పనిసరిగా కోడింగ్ వచ్చి ఉండాలి. ప్రోగ్రామింగ్‌పై కూడా పట్టు ఉంటేనే.. మంచి జీతంతో ఉద్యోగం వస్తుందని చాలామంది భావించేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో.. ఏఐ టూల్స్‌తోనే చాలా వరకు కోడింగ్ పనులు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కోడింగ్ అనేది ప్రస్తుతం ఓవర్‌రేటెడ్ స్కిల్ అని జెటా సీఈఓ భవిన్ తురఖియా అభిప్రాయపడ్డారు.

కోడ్ రాయడం కంటే..
భవిష్యత్తులో కోడ్ రాయడం కంటే కొత్తగా ఆలోచించడం, సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భవిన్ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నప్పటికీ, అంతగా అవసరం లేని స్కిల్ ఏదని అడిగితే.. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా కోడింగ్ అని సమాధానమిచ్చారు.

చాలామంది ఒక పనిని ఎలా చేయాలనే దానిపైనే ఎక్కువ సమయం పెడుతున్నారు, కానీ.. అసలు ఏం సాధించాలనే దానిపై సరైన ఆలోచన చేయడం లేదని భవిన్ చెప్పారు. ఏఐ కోడింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్న ఈ సమయంలో.. మనుషులు సమస్యను అర్థం చేసుకుని, ఏఐకి ఏం కావాలో స్పష్టంగా చెప్పగలగాలని వివరించారు.

వ్యాపారం గురించి
ఇక వ్యాపార రంగం గురించి మాట్లాడుతూ.. మంచి ఐడియా ఉంటే సరిపోదు, దాన్ని ఎంత బాగా అమలు చేస్తున్నామన్నదే ముఖ్యమని భవిన్ చెప్పారు. ప్రస్తుతం ఐడియాలు అందరికీ సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అసలైన విలువ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అలాగే.. సొంతంగా కంపెనీ ప్రారంభించడం కంటే.. సరైన కో-ఫౌండర్‌తో కలిసి ముందుకెళ్లడం మంచిదని సూచించారు. ఇద్దరు కలిసి ఆలోచనలు పంచుకోవడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు ప్రశ్నించడం వల్ల వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు.

రెజ్యూమ్‌ చూసి అంచనా
మరోవైపు ఉద్యోగాల విషయంలోనూ ఏఐ ప్రభావం పెరుగుతోందని ఆయన అన్నారు. గతంలో ఉద్యోగం కోసం అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్‌ చాలా ముఖ్యంగా ఉండేది. కానీ.. ఇప్పుడు ఏఐ సాయంతో ఎవరైనా ఆకర్షణీయమైన రెజ్యూమ్‌ తయారు చేసుకోవచ్చు. కాబట్టి కేవలం రెజ్యూమ్‌ను చూసి మాత్రమే అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని భవిన్ అభిప్రాయపడ్డారు. ఇకపై కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు ప్రాక్టికల్ టెస్టులు, ఇంటర్వ్యూలు, కేస్ స్టడీలు, వారు గతంలో చేసిన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలిపారు.

అయితే ఏఐ వచ్చిందని టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదని అనుకోకూడదని భవిన్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గణితం, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ వంటి ప్రాథమిక అంశాలపై మంచి పట్టు ఉండాలని సూచించారు.

పదేళ్ల వయసులోనే కోడింగ్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భవిన్ తురఖియా కూడా తన పదేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత డైరెక్టి, రాడిక్స్, జెటా వంటి సంస్థలను స్థాపించారు. ప్రస్తుతం ఎన్ఈఓ అనే ఏఐ ఆధారిత సంస్థపై పనిచేస్తున్నారు. ఒకప్పుడు కోడింగ్‌తోనే తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు ఏఐ కాలంలో కోడింగ్ కంటే ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ముఖ్యమని చెప్పడం టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను స్పష్టంగా తెలియజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement