క్లాసికల్‌ మ్యూజిక్‌తో బ్రెయిన్‌ మ్యాజిక్‌ | Carnatic Music Impact on Brain: IISc Bengaluru Study | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక శాస్త్రీయ కర్ణాటక సంగీత సాధనతో వృద్ధాప్యంలో మెదడు పనితీరు భేష్‌

Nov 11 2026 7:43 PM | Updated on Nov 11 2026 7:43 PM

Carnatic Music Impact on Brain: IISc Bengaluru  Study

ఇతరులతో పోల్చితే ఏకాగ్రత, కార్యనిర్వాహక సామర్థ్యాలు మెండు

బెంగళూరులోని ఐఐఎస్‌సీ పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెల్లడి  

సంగీతానికి రాళ్లయినా కరుగుతాయనే నానుడి ఉంది. మ్యూజిక్‌ ఎంతో పవర్‌ఫుల్‌ అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. తాజాగా ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. శాస్త్రీయ సంగీత సాధన అప్పటికప్పుడు మనోల్లాసాన్ని ఇవ్వటంతోపాటు ఆ వ్యక్తి వృద్ధాప్యంలోనూ మెదడు పనితీరును అద్భుతంగా కాపాడుతుందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి 22 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఈ నేపథ్యంలో వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవటం ఒక పెద్ద సవాలుగా మారింది.

ఈ పరిస్థితిపై బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)కి చెందిన సెంటర్‌ ఫర్‌ బ్రెయిన్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. టాటా లాంగిట్యూడినల్‌ స్టడీ ఆఫ్‌ ఏజింగ్‌ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా డాక్టర్‌ ఐశ్వర్య ఘోష్, డాక్టర్‌ థామస్‌ గ్రెగర్‌ ఐజాక్‌ తదితరులు నిర్వహించిన అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక ‘కరెంట్‌ సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

అధ్యయనం సాగిందిలా.. 
పరిశోధన కోసం మొత్తం 27 మంది ఆరోగ్యవంతులైన వృద్ధులను ఎంచుకున్నారు. కనీసం ఐదేళ్ల పాటు శాస్త్రీయ కర్ణాటక గాత్ర సంగీతంలో శిక్షణ పొంది, 26 ఏళ్లకు పైగా నిరంతరం సాధన చేస్తున్న 12 మంది గాయకులు ఇందులో పాల్గొన్నారు. సంగీతంతో ఏమాత్రం సంబంధం లేని మరో 15 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. వీరందరూ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మెదడులోని 116 విభాగాల మధ్య జరిగే నాడీ సంకేతాల అనుసంధానం తీరుతెన్నులను అధునాతన 3 Tf MRI స్కానింగ్, గ్రాఫ్‌ థియరీ విశ్లేషణల ద్వారా అధ్యయనం చేశారు.

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ మెదడులోని వివిధ పనులను నిర్వర్తించే విభాగాల మధ్య ఉండే ప్రత్యేకత తగ్గి, ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. దీనివల్ల సమాచార విశ్లేషణ మందగించి, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కానీ కర్ణాటక గాయకుల మెదడులోని నాడీ విభాగాలు ఒకదానితో ఒకటి కలవకుండా, అత్యంత స్పష్టంగా పనిచేస్తున్నట్లు తేలింది. కదలికల నియంత్రణకు కీలకమైన ‘సప్లిమెంటరీ మోటార్‌ ఏరియా’, ‘సెరిబెల్లమ్‌’ప్రాంతాల్లో స్థానిక నాడీ అనుసంధాన సామర్థ్యం భేషుగ్గా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల ఏకాగ్రత, కార్యనిర్వాహక సామర్థ్యాలను కొలిచే ‘ట్రైల్‌ మేకింగ్‌ టెస్ట్‌–బి’పరీక్షను సాధారణ వ్యక్తుల కంటే (154 సెకన్లు) సంగీతకారులు ఎంతో వేగంగా (113 సెకన్లలోనే) పూర్తి చేశారు. 

ఇదీ చ‌ద‌వండి: మాంసం తినండి.. పర్యావరణాన్ని కాపాడండి

తాళంతో మెదడుకు వ్యాయామం
వృద్ధాప్యం వల్ల మెదడు కణాలు కొంత మేర బలహీనపడినప్పటికీ, తన పనితీరును కోల్పోకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాపాడుకునే మెదడు సామర్థ్యాన్నే శాస్త్రవేత్తలు ‘కాగ్నిటివ్‌ రిజర్వ్‌’ అంటారు. కర్ణాటక సంగీతంలో తాళం వేయటం, రాగాలాపన, స్వర నియంత్రణ వంటి సంక్లిష్ట ప్రక్రియలు మెదడుకు నిరంతర వ్యాయామంలా పనిచేస్తున్నాయని గుర్తించారు. ఈ వ్యాయామమే మతిమరుపు వంటి నాడీ క్షీణత వ్యాధులను అడ్డుకునే రక్షణ కవచంగా నిలుస్తోందని ఈ పరిశోధన నిరూపిస్తోంది.  
సాక్షి స్పెషల్ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement