ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితగాథ తెరపైకి ఎక్కనున్నదని తెలియగానే చాలామంది సంగీత ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బులక్ష్మి పాత్రను ప్రముఖ నటి రష్మిక పోషిస్తున్నదని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పలువురిలో కలిగింది.
భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి ఒక శిఖరం. ఆమె గాత్రం కోట్లాది మందిని ఆకట్టుకుంది. భక్తిగీతాల నుంచి కర్ణాటక సంగీతంలోని క్లిష్టమైన కృతుల వరకు ఆమె చేసిన గానం అపూర్వమైన ముద్ర వేసింది. 1974లో రామన్ మెగసెసే అవార్డు, 1998లో భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. అయితే, ఆమె సంగీతం వెనుక ఉన్న కళాత్మక స్వేచ్ఛ, వ్యక్తిగత జీవితం, సామాజిక పరిస్థితులు, భర్త టి సదాశివం ప్రభావం, ఆమెపై ఏర్పడిన ‘దైవ స్వరూపం’ అనే గుర్తింపు.. మొత్తంగా చూస్తే ఎంఎస్ సుబ్బులక్ష్మి కథ.. ఔరా అనిపిస్తుందని ప్రముఖ కర్ణాటక గాయకుడు, రచయిత టీఎం కృష్ణ గతంలో రాసిన ఒక వ్యాసంలో విశ్లేషించారు.
దేవదాసి సంప్రదాయంలో జన్మించి..
1916లో మదురైలో వీణ విద్వాంసురాలు మదురై షణ్ముఖవడివు కుమార్తెగా సుబ్బులక్ష్మి జన్మించారు. ఆమె తల్లి దేవదాసి సంప్రదాయానికి చెందినవారు. పదేళ్ల వయసులోనే ‘మరకతవడివు’ పాటను జెంజూటి రాగంలో హెచ్‌ఎంవీ రికార్డుపై పాడి సంగీత ప్రపంచానికి పరిచయమయ్యారు. 1926 నాటి ఆ రికార్డింగ్‌లోనే వేగంగా, స్పష్టంగా, ధైర్యంగా స్వరాలను పలికించే ప్రత్యేకత ఆమెలో కనిపించిందని కృష్ణ పేర్కొన్నారు. అధికారిక జీవితచరిత్ర వివరాల ప్రకారం కూడా ఆమె చిన్న వయసులోనే గానప్రస్థానం ప్రారంభించి, తరువాత దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందారు.
మదురై నుంచి మద్రాస్‌కు..
1936లో 20 ఏళ్ల వయసులో సుబ్బులక్ష్మి మదురై నుంచి మద్రాస్‌కు వెళ్లారు. అక్కడ టి సదాశివం కుటుంబంతో ఆమెకు అనుబంధం ఏర్పడింది. స్వాతంత్య్ర ఉద్యమంతో సదాశివానికి అనుబంధం ఉండేది. ప్రకటనల రంగంలోనూ ఆయనకు అనుభవం ఉంది. ఎంఎస్‌లో ఉన్న సంగీత ప్రతిభను గుర్తించి ఆమె కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 1940లో సదాశివం భార్య మరణించిన తరువాత అదే ఏడాది జూలైలో ఎంఎస్‌ను సదాశివం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎంఎస్ జీవితం, కళా ప్రయాణంలో పెద్ద మార్పు ప్రారంభమైందని కృష్ణ విశ్లేషించారు.
‘మీరా’తో జాతీయ స్థాయిలో సంచలనం
1938 నుంచి 1947 మధ్య ఎంఎస్ ఐదు సినిమాల్లో నటించారు. వాటిలో సేవాసదనం, శకుంతలై, సావిత్రి, తమిళ మీరా, హిందీ మీరా ఉన్నాయి. 1947లో హిందీ మీరా విడుదలతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మీరా పాత్రను పోషించడం ఆమెకు వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా కూడా ప్రగాఢమైన అనుభూతిని కలిగించిందని ఆమెకు సన్నిహితులైన వారు చెప్పినట్లు కృష్ణ తెలిపారు. ఆ తర్వాత సదాశివం ఆమెను మళ్లీ సినిమాల్లో నటించనీయలేదని కృష్ణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
గాయని నుంచి ‘ఆధ్యాత్మిక మూర్తి’గా..
1950ల చివర, 1960ల నాటికి ఎంఎస్ గానశైలిలో మార్పు కనిపించిందని కృష్ణ తెలిపారు. మీరా భజనలతో పాటు తులసీదాస్, కబీర్, నానక్, సూరదాస్, తుకారాం రచనలు, రవీంద్రసంగీత్ వంటి విభిన్న సంగీత సంప్రదాయాలను ఆమె నేర్చుకున్నారు. కోల్‌కతాలో టాగోర్, పుణేలో తుకారాం, ఢిల్లీలో తులసీదాస్, మద్రాస్‌లో త్యాగరాజు.. ఇలా ప్రాంతానుసారం ఆమె గానంలో విభిన్న సాంస్కృతిక స్వరూపాలు కనిపించేవని కృష్ణ వివరించారు.
భజనల నీడలో మరుగునపడిన కర్ణాటక సంగీతం?
ఎంఎస్ 1968లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి ‘సంగీత కళానిధి’ అందుకున్నారు. అయితే అదే సమయంలో కర్ణాటక సంగీతానికి చెందిన కొందరు విమర్శకులు ఆమెను ప్రధానంగా భజన గాయనిగా చూడటం ప్రారంభించారని కృష్ణ పేర్కొన్నారు. ఆమె రాగం-తానం-పల్లవి వంటి అత్యంత క్లిష్టమైన కర్ణాటక సంగీత ప్రదర్శనలు చేసినప్పటికీ, అవి భజనలంత ప్రజాదరణ పొందలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 1963లో విడుదలైన వెంకటేశ్వర సుప్రభాతం రికార్డింగ్ ప్రజాదరణ పొందినప్పటికీ, ఆమె భజగోవిందం, విష్ణు సహస్రనామం వంటి భక్తిగీతాల ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లోకి చేరారని కృష్ణ గుర్తుచేశారు.
సదాశివం ప్రభావం.. సాధనలో పరిపూర్ణత
ఎంఎస్ కచేరీల్లో ఏ రాగం పాడాలి.. ఒక్కో కృతికి ఎంత సమయం కేటాయించాలి వంటి విషయాల్లో సదాశివం ప్రభావం ఉండేదని కృష్ణ తెలిపారు. ముఖ్యంగా శంకరాభరణం రాగాన్ని ప్రధానంగా పాడాలని ఆయన కోరుకునేవారని, ఆమె కొన్నిసార్లు భైరవి లేదా సావేరి వంటి రాగాలను పాడాలనుకున్నా ఆమె నిర్ణయం మారేదన్నారు. ఆమె తన సహకార కళాకారులతో తరచూ సాధన చేసేవారు. సాధారణంగా వేదికపైనే పరస్పర స్పందనతో సంగీతాన్ని వినిపించే కర్ణాటక సంప్రదాయానికి ఇది భిన్నమైన విధానమని కృష్ణ పేర్కొన్నారు. అయితే ఆ సాధన వల్ల ఆమె ప్రదర్శనలు సమన్వయంతో, తప్పుల్లేకుండా సాగేవని కూడా ఆయన తెలిపారు.

చివరికి మిగిలింది..
1970ల నాటికి ఎంఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కింది. 1974లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ఆమె, 1998లో భారతరత్న పొందిన తొలి సంగీత విద్వాంసురాలిగా నిలిచారు. అయితే ఈ బాహ్య విజయాల వెనుక నిజమైన ఎంఎస్ ఎక్కడ ఉందనేది ఇంకా ప్రశ్నగానే మిగిలిందని టీఎం కృష్ణ అంటారు. ఆమె తన సంగీతంలో పూర్తిగా తనను తాను వ్యక్తీకరించగలిగిందా? లేక సామాజిక, కుటుంబ, కళా అంచనాల మధ్య తన స్వరూపాన్ని మార్చుకోవాల్సి వచ్చిందా? దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే..


