ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఒక భారతీయ దర్శకురాలు రెండోసారి మనదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది. బెంగాల్‌కు చెందిన అనుపర్ణ రాయ్ రెండో చిత్రం ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ అంతర్జాతీయ జ్యూరీ ‘నెట్‌ప్యాక్’ (ఉత్తమ ఆసియా చిత్రం) అవార్డును గెలుచుకుంది. స్త్రీ సృజనాత్మకతకు, భారతీయ ఇండిపెండెంట్ సినిమా సత్తాకు ఈ విజయం ఒక మచ్చుతునక.
మన కమర్షియల్ సినిమా పెద్దలు హీరో కోసం ఎర్రరంగు డబ్బాలు ఎన్ని ఖర్చు పెడితే అంత గొప్ప అనుకుంటున్న వేళ, భారతీయ జీవనంలో చుక్క రక్తం కనపడక కొనసాగే వేదనాపూరిత రక్తపాతాన్ని తెర మీద ఒంపి అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది అనుపర్ణా సేన్. ఆమె తీసిన రెండో సినిమా ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ సెప్టెంబర్ 11న వెనిస్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శన ముగియగానే ప్రేక్షకులు ఏడు నిమిషాల పాటు లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటేనే ఆమె ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అలాగని ఆమె సినిమాలో గొప్ప స్టార్ కాస్టింగ్ లేదు. బడ్జెట్ లేదు. కేవలం కోటి రూపాయల లోపు ఖర్చుతో తీసిన ఈ సినిమాలో ఉన్నది జీవం, జీవితం.
వరుసగా రెండోసారి.. ఇదో రికార్డ్!
ఇటలీలోని వెనిస్‌లో సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో 80 దేశాల నుంచి 2000కు పైగా దరఖాస్తులను వడపోసి, 80 చిత్రాలను ఎంపిక చేస్తే వాటిలో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ఏకైక ఫిక్షన్ ఫీచర్ సినిమా అనుపర్ణ రాయ్ ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’. 2025లో ఆమె తన ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ సినిమాతో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఓరిన్జోంటి’ (నవ సినిమా) విభాగంలో ‘బెస్ట్ డైరెక్టర్’గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసింది.
ఆ నమ్మకంతోనే ఈ ఏడాది ఆమె రెండో సినిమాను నేరుగా ‘ఓరిన్జోంటి’ పోటీకి ఆహ్వానించారు. ఫ్రాన్స్ , ఇరాన్, ఇటలీ, జపాన్ దేశాల నుంచి వచ్చిన 15 బలమైన చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ అనుపర్ణ సినిమా ‘నెట్‌ప్యాక్’ జ్యూరీ మనసు గెలుచుకుని అవార్డు సాధించింది. నెట్‌ప్యాక్ అంటే ‘నెట్‌వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమా’. ఆసియా సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి యునెస్కో సహకారంతో ఏర్పాటైన సంస్థ. ‘నిజమైన ఆసియా గొంతుక’ను ప్రతిబింబించే ఉత్తమ చిత్రానికి ‘నెట్‌ప్యాక్’ ఇచ్చే ఈ పురస్కారం ఆస్కార్‌కు ఏ మాత్రం తక్కువ కాదు.
ప్రేమ లేని వాళ్ల ప్రేమకథ
108 నిమిషాల నిడివి ఉన్న ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ ముంబైలోని నలుగురు వలస జీవుల కథ. మున్సిపాలిటీలో దోమల మందు చల్లే కరీం, అతని భార్య అమీనా, సుక్కా అనే చిల్లర దొంగ, ఓమీ అనే పింప్... వీళ్లే ప్రధాన పాత్రలు. కరీంకు పెళ్లయినా సమాజానికి భయపడి తనలోని ‘గే సెక్సువాలిటీ’ని దాచుకుని బతుకుతుంటాడు.
అమీనా మొదట బార్‌లో, తర్వాత ఫోన్ సెక్స్ కాల్ సెంటర్‌లో పని చేస్తూ, నిజమైన ప్రేమ కోసం అల్లాడిపోయే ఒక ఒంటరి మహిళ. సుక్కా సమాజంలో కుల వివక్షకు గురై దొంగగా మారాడు. ఓమీ.... పింప్ (విటులను సరఫరా చేసేవాడు)గా బతుకుతుంటాడు. ఈ నలుగురు వలస జీవులు ఒకరి ఒంటరితనాన్ని ఒకరు ఎలా తాకారు? ఒకరినొకరు ఎలా మోసం చేసుకున్నారు? చివరికి ప్రేమ దొరకని ఆ నరక్రపాయమైన నగరంలో కూడా ‘ప్రేమను కలగనడమే’ వాళ్ల మనుగడగా ఎలా మారింది? అనేదే ఈ సినిమా ‘సమాజం కళ్లకు ఏ మాత్రం కనపడని, అది పక్కకు నెట్టేసే కిందిస్థాయి మనుషులను నేను ప్రేమతో, గౌరవంతో, నిజాయితీతో ఇందులో చూపించాలనుకున్నాను’ అన్నారు అనుపర్ణ. ఈ సినిమాలో ఆమె ముంబైని గ్లామర్‌గా చూపించకుండా, వలస కూలీల పాలిట అది ఎలా నరకంగా మారిందో కళ్లకు కట్టారు. ఈ సినిమా త్వరలోనే ‘ముబి’ లేదా ‘నెట్‌ఫ్లిక్స్’ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఫిల్మ్ స్కూల్ కెళ్లకుండానే..!
అనుపర్ణ రాయ్ ఎవరి దగ్గరా సినిమా శిష్యరికం చేయలేదు. ఆమె తనకు తానుగా సినిమా ఎలా తీయాలో తెలుసుకుంది. ఆమె తన మొదటి సినిమా ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటన్ ట్రీస్’ను దాదాపుగా తన ముంబై ఫ్లాట్‌లోనే తీసింది. నటీనటులను తన ఫ్లాట్‌లోనే ఉంచుకుని సినిమా పూర్తి చేసింది బడ్జెట్ లేక. ఈ సినిమాకు అంతర్జాతీయ సపోర్ట్ ఉన్నా తక్కువ బడ్జెట్‌లోనే ముగించింది. వరుసగా రెండేళ్లు వెనిస్ కాంపిటీషన్ లో తన సినిమాలు ప్రీమియర్ చేసిన అతికొద్ది మంది భారతీయుల్లో ఒకరిగా రికార్డు సృష్టించింది. వచ్చే నెల అక్టోబర్‌లో ‘బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ ఆసియా ప్రీమియర్ జరగనుంది. అంతేకాదు ఈ ఫెస్టివల్‌కు అనుపర్ణ ‘జ్యూరీ మెంబర్’గా కూడా వ్యవహరించబోతోంది.
మనమంతా ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఆస్కార్ వచ్చింది కదా అని సంబరపడతాం. కానీ ఎలాంటి స్టార్ పవర్ లేకుండా రూపాయి భారీ బడ్జెట్ లేకుండా.. కేవలం ముంబై మురికివాడలోని నలుగురు వలస జీవుల కథతో ప్రపంచ సినిమా తన వైపు తిరిగి చూసేలా చేసింది అనుపర్ణ. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు.. ‘అసలైన సినిమా ఎక్కడుందో’ కమర్షియల్ ప్రపంచానికి చేసిన ఒక హెచ్చరిక!


