బాత్రూం వస్తుందని జంప్‌ అయ్యాడు!.. ఆపై ట్విస్ట్‌ | Gurugram Hit-and-Run Case, Kalyan Bainsla Arrested After Dramatic Escape Attempt, Probe Takes New Turn, Watch Video | Sakshi
Sakshi News home page

బాత్రూం వస్తుందని జంప్‌ అయ్యాడు!.. ఆపై ట్విస్ట్‌

Sep 16 2026 9:29 AM | Updated on Sep 16 2026 10:14 AM

Gurugram Hit and Run Accused Used Toilet Excuse to Escape After Arrest

హైప్రొఫైల్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టిన ఘటనలో కల్యాణ్‌ బైన్‌స్లాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. అయితే అరెస్ట్‌ తర్వాత కూడా అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అతని ప్రయత్నం ఫలించకపోగా.. మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. మరోవైపు.. కల్యాణ్‌, సహ నిందితులకు శిక్ష పడేంత వరకు తన పోరాటం ఆగదని బాధితురాలు చెబుతోంది. 

సెప్టెంబర్‌ 13న గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డుపై హిట్‌ అండ్‌ రన్‌ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ సియా ప్రాణాలతో బయటపడింది. చిన్న ఉల్లంఘటనకు చలాన్లు వేసే ట్రాఫిక్‌ వ్యవస్థ.. ఈ ఘటనను తేలికగా తీసుకోవడాన్ని ఆమె భరించలేకపోయింది. ఆ యాక్సిడెంట్‌ వీడియోను నెట్టింట పోస్ట్‌ చేసి.. తీవ్ర చర్చకు దారి తీసింది. 

దీంతో పోలీసులు సుమోటోగా కేసు విచారణ చేపట్టారు. అయితే తప్పంతా ఆ బైకర్‌దేనని.. ఆమె దగ్గరకు వచ్చి కట్‌లు కొట్టిందని నిందితుడు కల్యాణ్‌ ఆరోపించాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన కల్యాణ్‌.. తన లాయర్‌తో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈలోపు.. నిన్న ఉదయం రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో దాక్కున్న అతడిని పోలీసులు ట్రేస్‌ చేసి పట్టుకున్నారు 

అయితే ఆ సమయంలో బాత్రూంకు వెళ్లాలని చెప్పి కల్యాణ్‌ రోడ్డు పక్కకు వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు చేజ్‌ చేయగా.. కొంత దూరం వెళ్లాక కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ్‌తో ఓ వీడియోను పోలీసులు రిలీజ్‌ చేశారు.

వీడియో వైరల్‌.. కేసులో కీలక మలుపు
సెప్టెంబర్‌ 13న గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డుపై మహిళా బైకర్‌ శివానీ చౌహాన్‌ అలియాస్‌ సియాను కారు ఢీకొట్టిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె తన స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మారుతి సుజుకి సియాజ్‌ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి శివానీ రోడ్డుపై పడిపోయి కొంత దూరం వరకు జారుకుంటూ వెళ్లారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. 

వీడియోలోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు తొలుత ర్యాష్‌ డ్రైవింగ్‌, గాయపర్చిన కేసుగా నమోదు చేశారు. అయితే దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాస్త ఉంటే తన ప్రాణం పోయేదని అటు సియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సీసీటీవీ, వైరల్‌ వీడియోలను విశ్లేషించిన అనంతరం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 109 కింద హత్యాయత్నం ఆరోపణను చేర్చారు. అలాగే మహిళను వెంబడించడం, ఆమె మర్యాదకు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన సెక్షన్లను కూడా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 

మీడియా ముందుకొచ్చి.. ఆపై ఫోన్‌ స్విచ్ఛాఫ్‌
ఘటన వీడియో వైరల్‌ అయిన తర్వాత కల్యాణ్‌ బైన్‌స్లా మీడియా ముందుకు వచ్చి తన వాదన వినిపించాడు. ఇది కావాలని చేసిన దాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పాడు. అయితే అనంతరం అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడు గురుగ్రామ్‌ నుంచి పాల్వాల్‌ మీదుగా రాజస్థాన్‌ వైపు వెళ్లినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు దౌసా–రాజ్‌గఢ్‌ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

కారులో మరో వ్యక్తి
ఈ ఘటనలో కల్యాణ్‌తో పాటు అతడి బంధువు లవ్నిష్‌ కూడా కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం కల్యాణ్‌ స్నేహితుడి పేరుతో ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్మీలో పని చేస్తున్న ఆ స్నేహితుడికి.. మీడియాలో వార్త వచ్చాకే జరిగిన ఘటన గురించి తెలిసింది. 

అరెస్ట్‌ మాత్రమే సరిపోదు: సియా 
మరోవైపు బాధితురాలు బైకర్‌ సియా (శివానీ చౌహాన్‌) ఈ ఘటన ప్రమాదం కాదని ఆరోపించారు. తనను కారు అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, తాను వేగం పెంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కారు తన బైక్‌ను ఢీకొట్టిందని ఆమె చెబుతున్నారు. కారులో నలుగురు ఉన్నారని.. వాళ్లంతా మద్యం సేవించారని.. అందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. నిందితుల అరెస్ట్‌తో కేసు ముగియదని శివానీ స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడే వరకు తాను సంతృప్తి చెందబోనని చెప్పారు. మరోవైపు కల్యాణ్‌ను కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కేసులో సీసీటీవీ ఫుటేజీ, వైరల్‌ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల వాదనలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

 ఇదీ చదవండి: సెక్యూరిటీ రీజన్‌.. నిరాశగా వెనుదిరిగిన అభిమానులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement