దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు | Tamil Nadu Hindu Couple Marries at Dargah Muslim Elders Bless Viral | Sakshi
Sakshi News home page

దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు

Sep 16 2026 11:26 AM | Updated on Sep 16 2026 11:49 AM

Tamil Nadu Hindu Couple Marries at Dargah Muslim Elders Bless Viral

మతాల మధ్య చిచ్చు పెట్టి తమ ప్రయోజనాలు చూసుకునే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతుండొచ్చు. కానీ సామాన్యులు మాత్రం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులోని నాగూర్‌ నుంచి ఇప్పుడు అలాంటి మానవీయతను చాటే ఓ అందమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. 

నాగపట్నం జిల్లాలోని నాగూర్‌ ఆండవర్‌ దర్గాకు ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోని సన్నిధి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టగా.. అక్కడే ఉన్న దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించారు.

ముస్లిం పెద్దల ఆశీర్వాదం..
నాగూర్‌ దర్గా చైర్మన్‌, వారసత్వ ట్రస్టీ మొహమ్మద్‌ ఖలీఫా సాహిబ్‌ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగపట్నం జిల్లా చాలా కాలంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగూర్‌ దర్గాలో వివిధ మతాలకు చెందిన ప్రజలు రావడం, తమ ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కొత్తేమీ కాదన్నారు.

వధూవరుల వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్గా నిర్వాహకులు హిందూ జంటను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాగూర్‌ దర్గా భిన్న మతాల ప్రజలు కలిసి మెలిసి ఉండే సంప్రదాయానికి మరోసారి వేదికగా నిలిచిందంటూ పలువురు స్పందిస్తున్నారు.  ఇలాంటి ఘటనలను భవిష్యత్‌ తరాలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందని ఖలీఫా సాహిబ్‌ అభిప్రాయపడ్డారు. 

ఓవైపు పలువురి అభ్యంతరాలు.. మరోవైపు మతం ఏదైనా ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావచ్చనే సందేశాన్ని ఈ వివాహ వేడుక చాటిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: నాగ్‌పూర్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement