టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్‌ను తాకాయి. దీంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.
భయంతో కేకలు..
విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి.
సేఫ్‌గా ల్యాండింగ్..
అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్‌షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్‌వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.
విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్‌లో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.
WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX
— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026


