ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పోలీసులు ఫిర్యాదు చేశారంటూ ‘ఎక్స్’ ఇచ్చిన వివరణ
‘హద్దులు’ దాటిన చంద్రబాబు సర్కారు అరాచకాలు
ఫిర్యాదు చేసింది ఏపీ పోలీసులు.. సంస్థ పేరు మాత్రం ‘ఎఫ్‌బీఐ’
ఎక్స్ మెయిల్స్‌తో బండారం బట్టబయలు
సోషల్ మీడియా పోస్టుల తొలగింపునకు ఎక్స్‌కు రిక్వెస్ట్
తొలుత ఎఫ్‌బీఐ ఫిర్యాదుగానే భావించిన ఎక్స్
తర్వాత అది ఏపీ పోలీసుల రిక్వెస్ట్ అని స్పష్టీకరణ
గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ అధికారిక మెయిల్ నుంచే రిక్వెస్ట్
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏవీ బ్రహ్మం పేరుతో మెయిల్
రిక్వెస్ట్‌లో ‘ఎఫ్‌బీఐ’ అని ఎందుకు రాశారో తమకు తెలియదన్న ‘ఎక్స్’
అమెరికా ఎఫ్‌బీఐకి ఈ రిక్వెస్ట్‌తో ఎలాంటి సంబంధం లేదని ‘ఎక్స్’ స్పష్టీకరణ
ఇంకా ఎన్ని ఖాతాలపై ఇలాంటి రిక్వెస్టులు వెళ్లాయోనని సందేహాలు
చంద్రబాబు డైరెక్షన్‌లో అంతర్జాతీయంగా పరువు తీసిన ఏపీ పోలీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ అణచివేత చర్యల కోసం.. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం కోసం పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు పోలీసుల స్థాయిని మరింత దిగజారి్చంది. సోషల్ మీడియాలో ప్రశ్నించేవారిపై కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్న చంద్రబాబు సర్కార్ అవి చాలవన్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసుల చేత తప్పుడు ఫిర్యాదులు చేయించే స్థాయికి కూడా దిగజారింది. సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలన్న చంద్రబాబు ఆదేశాలకు జీ హుజూర్ అంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో అభాసు పాలయ్యారు. ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. కానీ సంస్థ పేరు మాత్రం అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)! సోషల్ మీడియాలోని పోస్టులు తొలగించాలంటూ ‘ఎక్స్’కు చేసిన రిక్వెస్ట్‌లు ఇప్పుడు రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. గుంటూరు పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచి వచ్చిన ఆ రిక్వెస్ట్‌లో సంస్థ పేరు దగ్గర ‘ఎఫ్‌బీఐ’ అని రాశారు. దీంతో తొలుత అది అమెరికా ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన ఫిర్యాదేనని ఎక్స్ భావించింది. అయితే తర్వాత పంపిన ఫాలోఅప్ మెయిల్‌లో ‘‘ఆ రిక్వెస్ట్ ఎఫ్‌బీఐ నుంచి రాలేదు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచే వచ్చింది’’ అని ఎక్స్ స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు అలా ఎందుకు రాశారో తమకు తెలియదంది. అలా ఏపీ పోలీసుల గుట్టు రట్టయింది. పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు అంతర్జాతీయస్థాయిలో పోయింది. అలా ఏపీని చంద్రబాబు గారు ప్రపంచ పటంలో పెట్టారంటూ నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పోస్టులకు అమెరికా సంస్థ ఫిర్యాదా?
చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న పలువురు సోషల్ మీడియా కార్యకర్తలకు ఎక్స్ నుంచి అనేక మెయిల్స్ వచ్చాయి. అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు సంగతి బయటపడింది. ‘ఎక్స్’ లీగల్ విభాగం నుంచి ‘మీ పోస్టులు భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయంటూ ఎఫ్‌బీఐ నుంచి ఫిర్యాదు అందింది’ అని మెయిల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయాలపై పోస్టులు పెడితే అమెరికా ఫిర్యాదు చేయడమేంటి? అనే సందేహంతో ఎక్స్‌తో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని బట్టబయలు చేశాయి. తమకు అందిన ఫిర్యాదులపై ఆరా తీసిన ఎక్స్ కూడా ఏపీ పోలీసుల నిర్వాకాన్ని గ్రహించింది. తాము ముందు పంపిన మెయిల్‌లో ఎఫ్‌బీఐ అని పేర్కొనడం పొరపాటని, ఆ ఫిర్యాదు వచ్చింది ఏపీ పోలీసుల నుంచేనని అది స్పష్టం చేసింది. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ అధికారిక ఈ–మెయిల్ (జీయుఎన్‌టీయూఆర్‌యూఆర్‌బీఏఎన్‌ఎస్‌పీ–ఏపీ.జీవోవీ.ఐఎన్) నుంచి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏవీ బ్రహ్మం పేరుతో ఫిర్యాదు వచ్చిందని, దరఖాస్తులో సంస్థ పేరు దగ్గర ఆయనే ‘ఎఫ్‌బీఐ’ అని రాశారని తెలిపింది. అమెరికా ఎఫ్‌బీఐకి ఈ ఫిర్యాదుతో ఎలాంటి సంబంధం లేదని, ఏపీ పోలీసులు ఆ పేరు ఎందుకు వాడారో తమకే అర్థం కావడం లేదని ఎక్స్ లీగల్ విభాగం కుండబద్దలు కొట్టింది. ‘పూర్తి పారదర్శకత కోసం’ అంటూ అధికారి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ సహా రిపోర్టర్ సమాచారాన్ని యథాతథంగా బహిర్గతం చేసింది.
అడ్డగోలుగా అంతర్జాతీయ సంస్థలను వాడేస్తారా?
ఏపీ పోలీస్ అంటే ఎక్స్ అంతగా పట్టించుకోదు అనుకున్నారో ఏమో.. ఏకంగా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ పేరును వాడుకున్నారన్నమాట. చంద్రబాబు జమానాలో పోలీసుల అత్యుత్సాహంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇది బయటకు వచ్చింది కాబట్టి తెల్సిందని.. ఇలా ఏయే దర్యాప్తు సంస్థల పేర్లను వాడుకుని పోలీసులు ఇలా చేస్తున్నారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎన్ని ఖాతాలపై ఇలాంటి ‘ఎఫ్‌బీఐ’ ఫిర్యాదులు వెళ్లాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలెవరైనా పోలీసులను ఇలా గైడ్ చేశారా? ఎఫ్‌బీఐ పేరు చూస్తే ‘ఎక్స్’ భయపడి వెంటనే పోస్టులు తొలగిస్తుందన్న కుతంత్రమా? ఫిర్యాదు వెనక ఉన్నది తామేనని బాధితులకు తెలియకూడదన్న ఎత్తుగడా? ఎలా చూసినా ఇది రాష్ట్ర పోలీసు శాఖకు తలవంపులే. ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును అధికారిక ఫిర్యాదులో వాడటం దౌత్యపరంగానూ తీవ్రమైన అంశమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారింది. చంద్రబాబు చేస్తున్న దోపిడి, అవినీతి, దుర్మార్గపు పాలన, తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ మోసాలు, ఎన్నికలప్పుడు ఆయనిచ్చిన బాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే....ఆ ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమం జరుగుతోంది. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు తన చేతుల్లో తీసుకున్నారు.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ నేతలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, ఎడిటర్లయినా, జర్నలిస్టులైనా.. వారిని అణిచివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం చట్టాలను, పోలీస్ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెడుతున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
ప్రభుత్వ ఫిర్యాదులో ‘ఎఫ్‌బీఐ’ అని ఎందుకు రాశారు?
దీని వెనకున్న ప్రభుత్వ పెద్దలెవరు?
ఇది ఉన్నతాధికారుల అనుమతితోనే జరిగిందా?
ఆ పోస్టులపై ఎఫ్‌ఐఆర్ నంబర్ ఏంటి?
ఐటీ చట్టంలో ఏ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు?
ఇలా ఎన్ని ఖాతాలపై ఫిర్యాదులు పంపారు?
ఈ వ్యవహారంపై డీజీపీ విచారణ జరిపిస్తారా?


