కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సర్కారు ఆదేశాలు
జీవో 9తో నిరుద్యోగుల ఆందోళనలకు బ్రేక్ వేసే కుట్ర
20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అమలు ఏది?
ఉద్యోగాలు ఇవ్వరు.. నిరసనలు చేయనివ్వరా?
రాష్ట్రంలో రగిలిపోతున్న యువత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖ్యంగా జెన్‌జీ గొంతు నొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన జీవో 9ని బయటకు తీసింది. దానిని ఉపయోగించి రాష్ట్రంలో ప్రస్తుతం విస్తరిస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ జీవోలోని అంశాలను లోతుగా పరిశీలిస్తే ఇటు విద్యార్థులను, అటు కోచింగ్ సెంటర్లను కట్టడి చేయడానికి అవసరమైన నిబంధనలన్నీ ఉన్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగ యువత నుంచి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. దాంతో యువతను కట్టడి చేయడానికి మార్గాలను అన్వేషించడం మొదలయ్యింది.
అందులో భాగంగానే జీవో 9ను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. విద్యార్థుల రక్షణ, మానసిక ఆరోగ్యం కోసం గత ఏడాది సుప్రీంకోర్టు ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ జీవో జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నా... ఈ జీవో 9ను అడ్డం పెట్టుకుని జెన్‌జీ గొంతులను అణిచి వేసేందుకు చంద్రబాబు సన్నద్ధమవుతున్నారని అర్థమవుతోంది. రాజకీయ ఆందోళనలు, నిరసనల్లో విద్యార్థులు పాల్గొనేలా కోచింగ్ సెంటర్లు ప్రేరేపించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మంగళవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రగిలిపోతున్న యువత...
సూపర్ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు చంద్రబాబు ఎన్నికల ముందు రెండు హామీలను ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతీ, యువకులను మోసం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే అప్పటి వరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే 18 ఏళ్లు నిండిన 60 ఏళ్లలోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు మోసం చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆందోళన బాటపడుతున్నారు. ఇటీవల కాకినాడలో పోలీసు ఉద్యోగాల ఆశావహులు, కోచింగ్ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఉద్యోగ నియామకాల్లో జాప్యంతో వయసు పెరిగిపోతోందని, కోచింగ్ ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలంటూ ధర్నా నిర్వహించారు. అలాగే రాష్ట్రంలోని పలు చోట్ల నిరుద్యోగ యువత ఆందోళనలు ప్రారంభించడంతో చంద్రబాబు సర్కారు నిరుద్యోగ యువతను అణిచి వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని, రాజకీయ కుట్రలకు వేదిక అవుతున్నాయని ప్రచారం మొదలుపెట్టారు.
పేరుకే సమీక్ష.. కఠిన చర్యలకు ఆదేశాలు
రాష్ట్రంలో విస్తరిస్తున్న నిరుద్యోగుల ఆందోళననలను ఎలాగైనా అణచివేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దురుద్దేశ పూర్వకంగా కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఆందోళనలకు, నిరసనలకు దిగేలా పురికొల్పుతున్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు చెప్పాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కొన్ని కోచింగ్ సెంటర్లు అభ్యర్ధులను రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు వినియోగిస్తున్నట్లు సమావేశంలో చర్చకు వచ్చిందని అధికారులంటున్నారు.
కోచింగ్ సెంటర్లు అభ్యర్ధులను రాజకీయ పరమైన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు 2026 ప్రకారం... ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు.. జీవో 9
దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, హాస్టళ్లలో విద్యార్ధుల రక్షణ, మానసిక ఆరోగ్య కోసం సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జీవో 9 జారీ చేసింది. విద్యార్థుల భద్రత, సంక్షేమంతో పాటు కౌన్సిలింగ్ వేధింపులు నివారణకు, మౌలిక సదుపాయాలకు రాజ్యాంగంలోని 141 ఆరి్టకల్ ప్రకారం మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జిల్లాస్థాయి పర్యవేక్షక కమిటీలు ఏర్పడతాయి. కలెక్టర్, ఎస్‌పీ, డీఈవోలతోపాటు మరికొందరు అధికారులు, న్యాయవాది, సామాజికవేత్త ఈ కమిటీలలో సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లపై వచ్చే ఎలాంటి ఫిర్యాదులనైనా ఇవి స్వీకరించి సుమోటోగా విచారణ జరపవచ్చు.
ఎవరినైనా సరే విచారణకు పిలవవచ్చు. ప్రశ్నించవచ్చు. సాక్ష్యాధారాల కోసం ఆదేశించవచ్చు. కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ మొదలు రోజువారీ నిర్వహణ వరకు అనేక నిబంధనలు ఉన్నాయి. వాటిలో దేనినైనా పాటించలేదంటూ చర్యలు చేపట్టవచ్చు. ఇప్పుడు ఇదే జీవోను ఉపయోగించుకుంటోంది. జెన్‌జీ గొంతులు వినపడకుండా నులిమేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.


