విజయవాడ: యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమా నందన మంగళవారం గుట్టు చప్పుడు కాకుండా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. వీసా స్కామ్‌లో బుధవారం విచారణకు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే వచ్చి వెళ్లిపోయింది.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు బుధవారం వచ్చేందుకు బాధితులు సిద్ధమయ్యారు. అయితే, బాధితులు , మీడియా కంట పడకుండా ఉండేందుకు రమానందనకు పోలీసులు సహకరించినట్లు తెలుస్తోంది. రమానందన విచారణకు హాజరైన విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు గోప్యంగా ఉంచారు. కేవలం 30 నిమిషాలు మాత్రమే విచారించి రమానందనను పంపించేశారు.
తాను, తన భర్త మధుకర్ విచారణకు సహకరిస్తామని పోలీసులకు రమా నందన తెలిపింది. తమపై ఉన్న లుక్ అవుట్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని పోలీసులను కోరింది. న్యాయపరమైన సలహా తీసుకుని పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. ఒక రోజు ముందుగానే రమానందన విచారణకు హాజరవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


