డీఎస్సీలో అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసన | YSRCP Calls for Mass Protest on Sept 21 Over DSC Irregularities | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో అక్రమాలపై పోరాటం ఉధృతం.. 21న భారీ నిరసన

Sep 15 2026 4:40 PM | Updated on Sep 15 2026 5:07 PM

 YSRCP Calls for Mass Protest on Sept 21 Over DSC Irregularities

తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 21న విజయవాడ శాప్‌ ఆఫీస్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టనుంది. దీనిపై మంగళవారం తాడేపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. 21న ఉదయం 10 గంటలకు శాప్ ఆఫీసు ఎదుట నిరసన చేస్తాం. 16 వేల పోస్టులతో డీఎస్సీ అంటూ దగా చేశారు. స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు. అర్హులకు అన్యాయం జరిగింది.

ఉద్యోగం వచ్చిన వారు కూడా మాకు‌ ఎందుకు ఉద్యోగం వచ్చిందో తెలీదంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో కచ్చితంగా న్యాయ విచారణ జరపాలి. కానీ ప్రభుత్వం ఆపని చేయకపోవడం బాధాకరం. పేపర్ లీక్ జరిగింది, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది. అందుకే నేరుగా శాప్ ఆఫీసుకు వెళ్లి నిరసన తెలుపుతున్నాం.

డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేసే కార్యక్రమం చేస్తున్నారు. అధికారులను బలి చేయటానికూడా రెడీ అవుతారు. నారా లోకేశ్‌ కాకుండా ఇంకో మంత్రి ఉన్నట్లయితే ఇప్పటికే రాజీనామా చేయించే వారు. ఏ ఎస్సీనో. బీసీ మంత్రో అయితే బలి చేసేవారు. లోకేశ్‌ని కాపాడటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

డీఎస్సీ అనగానే ప్రభుత్వం భయపడుతోంది. డీఎస్సీపై ఎవరు మాట్లాడినా ఆ వీడియోలను తొలగిస్తున్నారు. టీవీ ఛానల్లో చూపిస్తే ఆ ఛానల్ల ప్రసారాలను ఆపేస్తున్నారు. ఏం చేసినా బాధితుల తరఫున పోరాడుతాం. ప్రతి ఏటా ఉద్యోగాలు ఇవ్వటం సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలి.

లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తారా? మరి అర్హుల సంగతి ఏంటి? డీఎస్సీ దొంగ.. నారా లోకేశ్‌.  పోలీసులను అడ్డు పెట్టుకుని ఉద్యమాలను అణచివేయలేరు’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్‌మెంట్‌లో గోల్‌మాల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement