సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి ఆళ్లనాని మృతిపై వైఎస్సార్సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆళ్లనాని మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని కలత చెందానని ఆ వార్తతో తాను శోక సముద్రంలో మునిగిపోయామన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు మాజీ మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు . మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతిక దేహానికి విశాఖపట్నం వైఎఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు నివాళులర్పించారు.
కాగా మాజీ మంత్రి ఆళ్ల నాని(57) గుండెపోటుతో ఈ రోజు (మంగళవారం) విశాఖ నివాసంలో కన్నుమూశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. వైఎస్సార్‌సీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్). కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి 2019లో మళ్లీ ఏలూరు నుంచి విజయం సాధించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఏలూరు రాజకీయాల్లో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆయన మృతి పట్ల పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం


