సాక్షి,కాకినాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు, ఆయన అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సర్పవరం పోలీసులు నిందితుడు సాధిక్ ఖాన్‌ను సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. పోలీసుల కస్టడీలో సాధిక్ ఖాన్ డ్రామాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది.
విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదని, పలు ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, పోలీసులు సాంకేతిక ఆధారాలు, సైనైడ్ విక్రయించిన వ్యక్తుల సాక్ష్యాలను చూపడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
విచారణలో పూర్తిస్థాయి వాస్తవాలు రాబట్టేందుకు, సాధిక్‌ను మరోసారి వారాల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు స్థానిక కోర్టులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఈ నూకరాజు అల్లుడు కొవ్వురి జగదీశ్వర రెడ్డి మృతిపై ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సాధిక్ ఖాన్‌పై కేసు నమోదైంది.
సుమారు రూ.25 కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే సాధిక్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జగదీశ్వర రెడ్డికి కొబ్బరి నీళ్లలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది.

అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి తర్వాత నూకరాజు కూతురు సౌజన్యను వేధించడం, కుటుంబంపై బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.ఈ ఘటనపై సర్పవరం పీఎస్‌లోనూ కేసులు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఇదీ చదవండి : సాధిక్ ఖాన్ మా మమ్మీనీ కొట్టేవాడు చాలా భయం వేసేది


