వినాయకుని దర్శనానికి 15 గంటలు | Lalbaugcha Raja Day 1 Long Queues VIP Debate | Sakshi
Sakshi News home page

వినాయకుని దర్శనానికి 15 గంటలు

Sep 15 2026 2:16 PM | Updated on Sep 15 2026 2:23 PM

Lalbaugcha Raja Day 1 Long Queues VIP Debate

ముంబై: గణపతి ఉత్సవాల్లో భాగంగా ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణేశోత్సవం 93వ సంవత్సరం వేడుకలు సెప్టెంబరు 14న ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల తొలిరోజే లక్షలాది మంది భక్తులు లాల్‌బాగ్‌లోని గణేశ్ మండపానికి తరలివచ్చారు. అర్ధరాత్రి కూడా భక్తుల రాక కొనసాగింది. భారీగా క్యూలు ఏర్పడ్డాయి. ముంబైతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూశారు.

భారీ రద్దీ కారణంగా క్యూలలో తోపులాటలు చోటుచేసుకున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. కొందరు భక్తులు 15-16 గంటలపాటు క్యూలో వేచి ఉన్నట్లు పోస్టులు పెట్టారు. అదే సమయంలో వీఐపీలకు సులభంగా దర్శనం లభిస్తుండటంపై చర్చ మొదలైంది. సాధారణ భక్తులకు కూడా గౌరవప్రదమైన, దర్శన సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. తొలిరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ లాల్‌బాగ్చా రాజాను దర్శించుకుని పూజలు చేశారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి మండపానికి వచ్చారు.

సాధారణ దర్శనం ఉచితమేనని, భక్తుల కోసం అధికారికంగా ఎలాంటి చెల్లింపు పాస్‌లు లేవని నిర్వాహకులు స్పష్టం చేశారు. రద్దీ నియంత్రణ, భద్రత కోసం మండపం పరిసరాల్లో పోలీసులను మోహరించారు. ఏఐ ఆధారిత కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. మండపానికి రాలేని భక్తుల కోసం 24 గంటల ఆన్‌లైన్‌ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంది.

భారీ రద్దీ నేపథ్యంలో ముంబై పోలీసులు లాల్‌బాగ్‌, కాలాచౌకీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. సెప్టెంబరు 14 నుంచి 25 వరకు పరిస్థితిని బట్టి అవసరమైన చోట 24 గంటలపాటు రహదారుల మూసివేత కొనసాగనుంది. లాల్‌బాగ్చా రాజా ఉత్సవాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నప్పటికీ, భారీ రద్దీని సురక్షితంగా నిర్వహించడం నిర్వాహకులు, అధికారులకు సవాలుగా మారింది.

ఇదీ చదవండి: ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్‌’.. కిలో ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement