ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో ప్రతిష్ఠించిన జీఎస్‌బీ మహాగణపతి విగ్రహానికి ఈ ఏడాది రూ.703.27 కోట్ల బీమా కల్పించారు. దేశంలోనే అత్యంత సంపన్న గణపతి మండపాల్లో ఒకటిగా పేరున్న జీఎస్‌బీ సేవా మండల్ ఈ బీమా తీసుకుంది. గత ఏడాది రూ.474 కోట్ల బీమా తీసుకోగా.. ఈ ఏడాది మొత్తం పెరిగింది.
ఈ మహాగణపతి విగ్రహాన్ని 66 కిలోలకు పైగా బంగారం, 335 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. విలువైన రత్నాలను కూడా విగ్రహానికి అలంకరించారు. ఈ ఆభరణాల్లో చాలా వరకు భక్తులు, సేవకులు విరాళంగా ఇచ్చినవేనని నిర్వాహకులు తెలిపారు.
జీఎస్‌బీ అంటే గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్. ఈ మండల్ ఈ ఏడాది 72వ గణేశోత్సవాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు 5 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. మహాగణపతి విగ్రహాన్ని పర్యావరణహితంగా తయారు చేశారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ 40,000 మందికి పైగా అన్నదాన సేవ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 5 రోజుల వ్యవధిలో 2 లక్షల మందికి పైగా ప్రసాదం అందుకోనున్నట్లు చెప్పారు.
వేద సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం పలు పూజలు, సేవలు నిర్వహించనున్నారు. కాగితపు వృథాను తగ్గించేందుకు సంప్రదాయ ముద్రిత రశీదుల స్థానంలో డిజిటల్ రశీదులను కూడా ప్రవేశపెట్టారు.


