దేవుళ్లపై భక్తుల ఫిర్యాదులు, విచారణ.. కఠిన శిక్షలు | God on Trial At Chhattisgarh temple | Sakshi
Sakshi News home page

దేవుళ్లపై భక్తుల ఫిర్యాదులు, విచారణ.. కఠిన శిక్షలు

Sep 13 2026 4:14 PM | Updated on Sep 13 2026 4:40 PM

God on Trial At Chhattisgarh temple

కోరిన కోరికలు తీర్చడం లేదని దేవుళ్లకే శిక్షలు వేస్తున్నారు ఓ గ్రామంలో. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని బంగారం దేవి ఆలయానికి శనివారం వచ్చిన భక్తులు తమ దేవుళ్లను వెంట తీసుకొచ్చారు. అయితే ఇది కేవలం పూజల రోజు కాదు. కొందరు భక్తులు తమ దేవుళ్లపై ఫిర్యాదులు చేసేందుకు అక్కడికి వచ్చారు.

ఈ సంప్రదాయాన్ని అనుసరించే సమాజాలకు బంగారం దేవి సాధారణ దేవత మాత్రమే కాదు. ఈ సంప్రదాయ న్యాయస్థానానికి ఆమె ప్రధాన దేవతగా భావిస్తారు. న్యాయమూర్తి, జైలర్ బాధ్యతలను ఆమె నిర్వహిస్తుందని నమ్ముతారు.

పూజిస్తున్నప్పటికీ అనారోగ్య సమస్యలు 
కేశ్‌కల్ ప్రాంతానికి చెందిన మంగళ్ చంద్ మార్కమ్ కొన్నేళ్లుగా ఒక దేవతను పూజిస్తున్నా, ఆయన కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కొనసాగాయి. దీంతో ఆ దేవతను భంగారం దేవి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తన కుటుంబాన్ని కాపాడే బాధ్యతను ఆ దేవత నిర్వర్తించలేదని ఫిర్యాదు చేసి, శిక్షించాలని కోరారు.

కేశ్‌కల్ గ్రామాలు, పరిసర ప్రాంతాల్లోని గిరిజన సమాజాలు పూజించే దేవతల ప్రతీకలను భాదో జాత్ర సమయంలో ఆలయానికి తీసుకొస్తారు. ఈ సమయంలో ఈ మతపరమైన సమూహ సమావేశం సంప్రదాయ న్యాయస్థానంలా మారుతుంది. ఇందులో సాధారణంగా ఫిర్యాదుదారు భక్తుడిగా ఉంటాడు. నిందితుడిగా దేవత ఉండవచ్చు.

కుటుంబ సభ్యుడు ప్రార్థనలు చేసినా అనారోగ్యంతోనే ఉండటం, కష్టపడి పంట పండించినా పంటలు దెబ్బతినడం వంటి రోజువారీ జీవిత సమస్యలపై ఫిర్యాదులు ఉంటాయి. ఎన్నేళ్లుగా పూజిస్తున్న దేవత నుంచి తమకు రక్షణ, శ్రేయస్సు లభించలేదని కుటుంబాలు భావిస్తాయి.

తమ బాధ్యతను దేవత నిర్వర్తించలేదని భక్తులు భావించినప్పుడు, ఆ దేవతను బంగారం దేవి ఆలయ న్యాయస్థానం ముందు తీసుకొస్తారు. ఇతర దేవతలపై వచ్చిన ఫిర్యాదులను భంగారం దేవి ముందు ఉంచుతారు. భక్తులు తమ సమస్యలను వివరిస్తారు. తాము ఆధారాలుగా భావించే అంశాలను న్యాయస్థానం ముందు సమర్పిస్తారు. అనంతరం సమాజ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం తీర్పు వెలువడుతుంది.

దేవతలకు కఠిన శిక్ష 
ఒక దేవతను అక్కడ ఉంచిన తర్వాత దానిని ఇకపై పూజించరు. ఆ కుటుంబం లేదా గ్రామం మరో దేవతను పూజించడం ప్రారంభిస్తుంది. మరో గ్రామస్థుడు సోమ్లు కుంజమ్ మాట్లాడుతూ.. తాను వ్యవసాయంలో కష్టపడి పనిచేసినా గత 2 సంవత్సరాలుగా దిగుబడి తక్కువగానే ఉందని తెలిపారు. ఆ బాధ్యతను తన దేవత సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే ఇలా జరిగిందని భావించి, ఆ దేవతపై చర్య తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

ఆలయ కమిటీ కార్యదర్శి నంద్‌లాల్ సిన్హా మాట్లాడుతూ.. భాదో జాత్రకు ప్రజలు తమ దేవతలపై వివిధ రకాల ఫిర్యాదులతో వస్తారని తెలిపారు. సంప్రదాయ విచారణలో భాగంగా ఈ ఫిర్యాదులను వింటారని చెప్పారు. చిన్న ఫిర్యాదుల విషయంలో దేవతకు కేవలం హెచ్చరిక ఇచ్చి, తన బాధ్యతలను మెరుగ్గా నిర్వర్తించాలని సూచిస్తూ తిరిగి పంపవచ్చని సిన్హా తెలిపారు.

ఒక దేవత చాలాకాలంగా తమకు సహాయం చేయలేదని లేదా పట్టించుకోలేదని గ్రామస్థులు భావిస్తే మరింత కఠినమైన శిక్ష విధించవచ్చని చెప్పారు. అలాంటి దేవతలకు శాశ్వత శిక్ష విధించవచ్చని తెలిపారు. వాటి ప్రతీకలను ఆలయ ప్రాంగణంలోని ఒక గుంతలో ఉంచుతారు. ఆ ప్రాంతాన్ని సమాజం జైలుగా పిలుస్తుంది.

ఒక దేవతను అక్కడ ఉంచిన తర్వాత దానిని ఇకపై పూజించరు. ఆ కుటుంబం లేదా గ్రామం మరో దేవతను పూజించడం ప్రారంభిస్తుందని సిన్హా తెలిపారు. ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైందనే దానిపై లిఖితపూర్వక ఆధారం ఏదీ లేదని సిన్హా వివరించారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని, వివిధ గ్రామాల ప్రజలు తమ కుటుంబం లేదా గ్రామ దేవతలపై ఫిర్యాదులతో ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement